Rushikonda Beach: రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుమా!?
ABN, First Publish Date - 2023-07-09T01:34:35+05:30
నగరంలోని రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు రూ.20 ప్రవేశ రుసుము పెట్టడంపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, సందర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎక్కడా ఇలా ప్రవేశ రుసుము పెట్టలేదు. రుషికొండకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చినందున, దానిని నిర్వహించడానికి వ్యయం అవుతున్నదని, అందుకే ప్రవేశ రుసుము పెడుతున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించింది.
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసన
అభ్యంతరం వ్యక్తంచేసిన ప్రజా సంఘాలు, విపక్షాలు
కొండలు, సముద్రాలు సహజ వనరులు
వాటి సందర్శనకు రుసుములు తీసుకునే అధికారం పాలకులకు లేదన్న అపార్టుమెంట్ రెసిడెంట్స్, కాలనీ అసోసియేషన్స్ ఫెడరేషన్
బీచ్‌ను నిర్వహించలేని స్థితిలో జీవీఎంసీ ఉందా?..అంటూ ప్రశ్నలు
తక్షణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరంలోని రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌కు రూ.20 ప్రవేశ రుసుము పెట్టడంపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, సందర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎక్కడా ఇలా ప్రవేశ రుసుము పెట్టలేదు. రుషికొండకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చినందున, దానిని నిర్వహించడానికి వ్యయం అవుతున్నదని, అందుకే ప్రవేశ రుసుము పెడుతున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రవేశ రుసుము చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఈ నిర్ణయంపై విశాఖపట్నం అపార్టుమెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వార్వా), గ్రేటర్ విశాఖ రెసిడెంట్ కాలనీ అసోసియేషన్స్ ఫెడరేషన్ (నివాస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. కొండలు, చెరువులు, వాగులు, నదులు, సముద్రం ప్రజలకు చెందినవని, వాటి సందర్శనకు రుసుములు నిర్ణయించే అధికారం ఏ సంస్థకూ లేదని పేర్కొన్నాయి. అలాంటి వాటిని ప్రజలు చెల్లించే పన్నులతో అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పించి, వినోదభరితంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉందన్నారు. ఒక బీచ్ నిర్వహణ వ్యయాన్ని కూడా భరించలేని స్థితిలో జీవీఎంసీ ఉదా?...అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రతి దానికి ఫీజు పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఉందని, ఇది అన్యాయమని ఆరోపించారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసమే ఈ ప్రవేశ రుసుము వసూలు చేయాలనుకుంటే...ఆ గుర్తింపు విశాఖ ప్రజలకు అవసరం లేదని వార్వా, నివాస్‌లు స్పష్టంచేశాయి. సాయంత్రమైతే కాసేపు సేద తీరడానికి బీచ్‌కు వెళితే...అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తామనడం దారుణమని, ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని, బీచ్‌లను వ్యాపారమయం చేయవద్దని డిమాండ్ చేశాయి.
బీచ్‌లను కూడా వదలరా?
గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు. అమ్మాలనుకున్నవి అమ్మేశారు, కూల్చాలనుకున్నవి కూల్చేశారు. వేయాలనుకున్న పన్నులు వేసేశారు. ఇప్పుడేమో బీచ్‌లు మిగిలాయని అక్కడికి వెళితే...ప్రవేశ రుసుము అంటున్నారు. వైజాగ్ అంటేనే బీచ్‌లు. వైసీపీ వచ్చిన తరువాత బీచ్‌లలో పార్కింగ్ ఫీజు ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 చొప్పున వసూలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మనుషులూ కట్టాలంటున్నారు. ఇది అభ్యంతరకరం. తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.
దేశంలో ఎక్కడా లేదు
ఎం.సత్యనారాయణ (విద్యార్థి)
దేశంలో ఎక్కడా బీచ్‌లో ప్రవేశానికి టిక్కెట్ లేదు. రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి ఇరవై రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించడం అన్యాయం. ఇటువంటి నిర్ణయాల వల్ల బీచ్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య పడిపోతుంది.
ప్రభుత్వం తెలిసి చేస్తుందో...తెలియక చేస్తుందో...
వి.మాధవరావు (ఆర్మీ ఉద్యోగి)
చెన్నైలో మెరీనా బీచ్‌లో ప్రవేశానికే టిక్కెట్ లేదు. రుషికొండ బీచ్‌లోకి ఎంట్రీ టికెట్ రూ.20 పెట్టడం చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వం తెలిసి చేస్తుందో లేక తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు. టిక్కెట్ తీసుకుని బీచ్‌లోకి వెళ్లాల్సిన ఆవశ్యకత సందర్శకులకు ఏముంటుంది. తక్షణం ఎంట్రీ టిక్కెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఎంట్రీ టికెట్ పెడితే ఆర్కే బీచ్‌కో, మరో బీచ్‌కో వెళతారు.
ప్రకృతిని చూడడానికి ఎంట్రీ టిక్కెట్ ఏమిటి
ఎన్.శ్రీనివాస్, తెలంగాణ వాసి
ప్రకృతి అందాలను చూడడానికి టిక్కెట్ పెట్టడం చాలా అన్యాయం. పక్క రాష్ట్రాల నుంచి వచ్చాము. ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి పది మందికి చెబితే ఏపీ బ్యాడ్ అవుతుంది. ఈ బీచ్‌లో మౌలిక సదుపాయాలు లేవు. ఎంట్రీ టికెట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రవేశ రుసుము పెడితే రుషికొండ బీచ్‌కు నష్టం వాటిల్లుతుంది.
Updated Date - 2023-07-09T11:32:28+05:30 IST