Delhi: సీపీఎం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద పోలవరం నిర్వాసితుల ధర్నా
ABN, First Publish Date - 2023-08-07T13:23:21+05:30
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు.
న్యూఢిల్లీ: పోలవరం (Polavaram) నిర్వాసితులకు పరిహారం, పునరావాసం (ఆర్అండ్ఆర్) కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (Srinivasarao) ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద భారీ ధర్నా (Protest) చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ప్రారంభించారు. ఈ ధర్నాలో వందలాది మంది పోలవరం బాధితులు, గిరిజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అంటే నిర్వాసితుల సమస్యను పరిష్కరించడమేనన్నారు. పోలవరం ముంపు సమస్య జాతీయ సమస్యగా మారిందని, అందుకే వందలాది మంది నిర్వాసితులు గిరిజనులు ఢిల్లీకి తరలివచ్చారన్నారు. ముంపు బాధితుల ప్యాకేజీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు..
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని, పునరావాసం కల్పించడం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతని అన్నారు. 8 మండలాల్లో దాదాపు 390 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, బాధితుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ముందు సాగిలపడిందని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు నిర్వాసితులు, గిరిజనులను మోసం చేస్తున్నాయన్నారు. ఇటు మోదీ ప్రభుత్వం.. అటు జగన్ ప్రభుత్వం ఇద్దరిపైన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పునరావస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, సహాయం పునరావాసం చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం మోసం చేసిందని సీతారాం ఏచూరి ఆరోపించారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. చేసిన వాగ్దానాలనే అమలు చేయమని కోరుతున్నామన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను గౌరవించి.. అమలు చేయాలని కోరుతున్నామన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వెంటనే సహాయ పునరావస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం పోరాడుతుంది సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.
ఏపీని మోదీకి తాకట్టు పెట్టిన జగన్...
సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ (Brinda Karat) మాట్లాడుతూ... తనపై ఉన్న ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల వల్ల సీఎం జగన్ (CM Jagan) కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, భయపడి కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని అన్నారు. తన కేసుల నుంచి బయటపడటం కోసం ఆదివాసీల ప్రయోజనాలు, ఏపీని జగన్మోహన్ రెడ్డి, మోదీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తాను రెండు మూడు సార్లు పోలవరంలో పర్యటించానన్నారు. ఆదివాసీలకు అన్యాయం చేసి ప్రాజెక్టు కట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే ఆదివాసీలు దేశంలో భాగం కాదా అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని బృందా కారత్ అన్నారు.
Updated Date - 2023-08-07T13:23:21+05:30 IST