Lokesh Yatra : యువగళం @ 200
ABN, First Publish Date - 2023-08-31T03:10:30+05:30
చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర గురువారం 200 రోజుల మైలురాయిని చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆయన ఈ ...
యువగళం వినిపిస్తూ.. ప్రజాకర్షక నేతగా ముందుకు
లోకేశ్ యాత్రకు నేటితో 200 రోజులు.. ఇప్పటికి 2,710 కి.మీ.లు
చిన్న పాయ నుంచి ఉధృత ప్రవాహంలా!
నాయకుడి స్థాయి నుంచి ప్రజాకర్షక నేతగా..
మరో కీలక మైలురాయిని చేరుకున్న లోకేశ్
సగటున రోజుకు 13.5 కి.మీ. నడక
ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం
అధికారంలోకి వస్తే ఏం చేస్తామో
అక్కడికక్కడే సవివర ప్రకటన
పాలకపక్షంపై పదునైన మాటలతో విమర్శలు
సెల్ఫీ చాలెంజ్‌లు.. ప్రతి వంద కి.మీ.కు
ఓ శిలాఫలకం.. శ్రేణుల్లో ఉత్సాహం, భరోసా
185 మండలాలు, 1,675 గ్రామాల్లో
2,710 కిమీ మేర లోకేశ్ పాద యాత్ర
77 నియోజకవర్గాలు
185 మండలాలు
1,675 గ్రామాలు
64 బహిరంగ సభల్లో ప్రసంగం
132 ముఖాముఖి సమావేశాలు
8 రచ్చబండ సమావేశాలు
10 ప్రత్యేక కార్యక్రమాలు
చిన్న పాయలా తడబడుతూ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేశ్ పాదయాత్ర 200 రోజుల్లో సమరోత్సాహం తొణికిసలాడే ఉధృత ప్రవాహంలా మారింది. దేనికైనా సై అంటూ రాజకీయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న ఆయన.. నాయకుడి స్థాయి నుంచి స్టార్ అట్రాక్షన్‌గా ఎదిగారు. నమ్మకమైన నేతగా పార్టీ శ్రేణుల మనసు చూరగొని.. వారు తన వెన్నంటి నడిచే విశ్వాసం సంపాదించుకున్నారు. అధికార పక్ష నేతలకు కలవరం కలిగిస్తున్న జనాకర్షణ యాత్రగా ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర గురువారం 200 రోజుల మైలురాయిని చేరింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆయన ఈ లక్ష్యాన్ని అధిగమించారు. కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నుంచి తన యాత్ర ప్రారంభించారు. అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైనా.. భుజం నొప్పి బాధిస్తున్నా ఒక్కరోజూ విశ్రాంతి తీసుకోకుండా, విరామం ఇవ్వకుండా లోకేశ్ యాత్రను సాగిస్తుండడం విశేషం. ఇప్పటికి ఈ యాత్ర 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిమీ మేర జరిగింది. 185 మండలాలు/మునిసిపాలిటీలు, 1,675 గ్రామాల మీదుగా సాగింది. సరాసరిన రోజుకు 13.5 కిమీ దూరం ఆయన నడుస్తున్నారు. ఒక రోజు రికార్డు స్థాయిలో 22 కిలోమీటర్లు నడిచారు. ఈ 200 రోజుల్లో మొత్తం 64 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, పది ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4వేలకు పైగా వినతిపత్రాలు అందాయి. వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకొన్నవారు అంతకు పదుల రెట్ల సంఖ్యలో ఉన్నారు. విజయవాడ నగరంలో జరిగిన పాదయాత్ర సంచలనంగా నిలిచింది. తెల్లవారుఝామున 3.30గంటల వరకూ ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రజలు రోడ్లపై నిలబడ్డారు. వారందరినీ పలుకరిస్తూ ఆ సమయంలో నడక ఆపారు. లోకేశ్‌కు వచ్చిన స్టార్ ఇమేజ్‌కు రోజూ పొద్దున్నే ఆయనతో ఫొటోలు దిగడానికి తరలివస్తున్న వారి సంఖ్యే నిదర్శనంగా నిలుస్తోంది. ‘సెల్ఫీ విత్ లోకేశ్’ పేరుతో ఎంతమంది వచ్చినా వారితో ఆయన సెల్ఫీ దిగుతున్నారు. ఒక్కోరోజు వీరి సంఖ్య 2వేల వరకూ ఉంటోందని టీడీపీ వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లాలో ఒకచోట 2,500మంది ఒకరోజు ఫొటోలు దిగారు. మొత్తమ్మీద ఇప్పటివరకూ ఆయనతో సుమారుగా 3లక్షల మంది సెల్ఫీలు దిగారు. దీనివల్ల ఆయనకు అప్పుడప్పుడూ భుజం నొప్పి వస్తోంది. అయినా భరిస్తున్నారు. సెల్ఫీ కార్యక్రమం ఎత్తివేయాలని వైద్యులు సూచించినా ఆపడం లేదు.
ప్రత్యర్థులపై ‘ప్రసంగాల’ దాడి
పోలీసు కేసులకో, అధికార పార్టీ వేధింపులకో భయపడి వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తి పోరాడేందుకు టీడీపీలో అనేకమంది నేతలు సంశయిస్తున్న సమయంలో లోకేశ్ పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తుండడం పాదయాత్రకు మంచి గుర్తింపును ఇచ్చింది. అనేక నియోజకవర్గాల్లో ఆయన రాజకీయ వేడి పుట్టించారు. ప్రత్యేకించి రాయలసీమలో అనేకచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను, అధికార దుర్వినియోగాన్ని ఆధారాలతో ఎత్తిచూపి విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఏకిపారేయడంతోపాటు స్థానిక నేతల వ్యవహారాలను తూర్పారబట్టారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. వివరణలు ఇవ్వలేకపోతే లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. లోకేశ్ విమర్శల దాడి.. పాదయాత్రకు వస్తున్న స్పందనతో కలవరానికి గురైన అధికార పక్షం పోలీసు కేసులతో ఈ ఉత్సాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలను ప్రయోగించి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసులు మోపుతున్నారు. గన్నవరంలో 46 మంది కీలక నేతలపై కేసులు పెట్టారు. చివరకు విదేశాల్లో ఉన్నవారిపైనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిమీకు ఒకటి చొప్పున మొత్తం 25 కేసులు పెట్టారు. ఇందులో లోకేశ్‌పైనే 3కేసులు పెట్టారు. ఆయన ప్రచార రఽథం, సౌండ్ సిస్టం.. చివరకు స్టూల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాదయాత్రను స్వాగతిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం, టీడీపీ కార్యకర్తలు తిరగబడితే పారిపోవడం ఆనవాయితీగా మారింది.
ముఖాముఖి.. రచ్చబండలు
పాదయాత్రలో అనేక వర్గాల వారితో లోకేశ్ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లిం మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, న్యాయవాదులు, రవాణా రంగ ప్రతినిధులు తదితరులతో 132 సమావేశాలు నిర్వహించారు. ఆయా సందర్భాల్లో కొన్ని స్పష్టమైన హామీలు కూడా ప్రకటించారు. ఫీజుల సమస్యతో విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వకపోవడాన్ని గమనించి తాము రాగానే వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా వారికి ఆ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని.. ఏటా జాబ్ కేలెండర్ ప్రకటిస్తామని.. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. కుల ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మొబైల్ ఫోన్‌కు అందే ఏర్పాటు చేస్తామని.. చేనేతలు, రజక వృత్తి వారికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. పాదయాత్రలో ఆయన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ బాధితులతో, తాడికొండ నియోజకవర్గంలో అమరావతి రైతులతో, మంగళగిరి నియోజకవర్గంలో యువతతో, ఒంగోలులో బీసీలతో, నెల్లూరులో మహిళలతో, శింగనమలలో రైతులతో, ఆదోనిలో పార్టీరహితంగా సర్పంచులతో, కర్నూలులో ముస్లిం మైనారిటీలతో, కడపలో రాయలసీమ ప్రాంత మేధావులు, ప్రముఖులతో భేటీలు జరిపారు. కడపలో మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ అభివృద్ధి వ్యూహాన్ని కూడా ప్రకటించారు. పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక ప్రజా సమస్యను ఎంచుకుని దానిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇలా ఇప్పటికి 27 శిలాఫలకాలు ఆవిష్కరించారు.
ఏ జిల్లాలో ఎన్ని రోజులు..
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45 రోజులు, అనంతపురం జిల్లాలోని 9నియోజకవర్గాల్లో 23 రోజులు, కర్నూలు జిల్లాలోని 14నియోజకవర్గాల్లో 40రోజులు, కడప జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 16 రోజులు, నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 31 రోజులు, ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 17రోజులు, గుంటూరు జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో 16రోజులు, కృష్ణాజిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 8 రోజులు, ఇప్పటి దాకా పశ్చిమగోదావరి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో నాలుగు రోజులపాటు ఆయన నడిచారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 577 కిమీ దూరం నడవగా.. కృష్ణా జిల్లాలో అతి తక్కువగా 113 కిమీ యాత్ర సాగించారు.
పార్టీ శ్రేణుల్లో పెరిగిన విశ్వాసం
గతంతో పోలిస్తే పాదయాత్ర లోకేశ్‌పై టీడీపీ శ్రేణుల్లో విశ్వాసం పెంచింది. అధికార పార్టీ నేతల అణచివేత చర్యలను, వేధింపులను తీవ్రంగా నిరసిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని ఆయన పదేపదే చేస్తున్న ప్రకటనలు కార్యకర్తలకు భరోసా కల్పించాయి. ఎన్ని దాడులు జరిగినా... ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ప్రత్యేకించి యువత, మహిళల్లో లోకేశ్ ఇమేజ్ బాగా పెరిగినట్లు పాదయాత్రకు వస్తున్న స్పందన చాటుతోంది. ప్రతి చోటా ఆయన వెంట నడుస్తున్న వారిలో యువత సంఖ్య బాగా ఎక్కువగా ఉంటోంది. మహిళలు కూడా ఆయనను చూసేందుకు, ఫొటోలు దిగడానికి పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వస్తున్నార
గుంటూరులో 200 ట్రాక్టర్లతో ర్యాలీ
గుంటూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): లోకేశ్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో 200 ట్రాక్టర్లతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయానికి, రైతుకు తోడూ నీడై నిలిచే ట్రాక్టర్లతో ర్యాలీ చేయడం ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ... ఒక్కడితో మొదలై కోట్లమందికి చేరువైన యువగళం పాదయాత్ర ప్రజా ఉప్పెనతో 200 రోజులు పూర్తి చేసుకుంటోందన్నారు. కుప్పంలో పడిన తొలి అడుగు నుంచి నేటి వరకూ అఖండ ప్రజాదరణతో సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - 2023-08-31T04:46:28+05:30 IST