YS Viveka Case: వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌పై జగన్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారంటే..
ABN, First Publish Date - 2023-04-17T18:52:54+05:30
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) ముందు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన..
హైదరాబాద్: 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) ముందు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన పరిణామం వైఎస్ జగన్ (YS Jagan) చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య (Viveka Murder). ఊహించని ఈ పరిణామం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వివేకా మృతికి గుండెపోటు కారణమని తొలుత ప్రచారం జరిగినా ఆ తర్వాత నరికి చంపినట్లు.. ఇది పక్కా హత్య అని పోలీసులు నిర్ధారించారు. తాజాగా.. వివేకా హత్య కేసు విచారణలో (Viveka Murder Case) వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేసింది.
అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచి అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వివేకా హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య ఓ పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ సందర్భంగా.. వివేకా హత్య జరిగిన సందర్భంలో వెలుగులోకొచ్చిన నాటకీయ పరిణామాలను ఒక్కసారి రివైండ్ చేసుకుంటే అవినాష్ తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారనే విషయం స్పష్టమవుతోంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న ఈ తరుణంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
అవినాష్ రెడ్డిపై అప్పట్లో జగన్ అసంతృప్తికి కారణం ఏంటంటే..
వివేకా మరణించినట్లు శుక్రవారం ఉదయం (మార్చి 15, 2019) 6:30 గంటలకు గుర్తించారు. ఈ విషయాన్ని మొదట గుర్తించిన పీఏ కృష్ణారెడ్డి మాజీ ఎంపీ అవినాశ్‌కు సమాచారం చేరవేశారు. అంతకు ముందే ఎర్రం గంగిరెడ్డి అక్కడికి వచ్చి వెళ్లారని తెలుస్తోంది. గుండెపోటుతోనే వివేకా మరణించినట్లు బంధువులకు, కుటుంబసభ్యులకు కూడా చెప్పినట్లు సమాచారం! వివేకా శరీరంపై తీవ్ర గాయాలున్నాయని ఆయన కుమార్తె డాక్టర్ సునీతకు తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తాను వచ్చేదాకా పోస్టుమార్టం కూడా చేయొద్దని ఆమె కోరారు.
పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం దాకా వివేకాది సహజమరణం/అనుమానాస్పద మృతి గానే ప్రచారం జరిగింది. అయితే.. ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. సాయంత్రం పులివెందులకు వచ్చిన జగన్... హత్య జరిగిందనే విషయాన్ని ఎందుకు దాచారు, గుండెపోటు అని ఎందుకు చెప్పారని అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. హత్య జరిగిందంటే పులివెందులలో అల్లర్లు జరుగుతాయని, అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని అవినాశ్ సమర్థించుకున్నప్పటికీ.. దీనిపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
Updated Date - 2023-04-17T18:52:59+05:30 IST