Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. విచారణ కీలక దశలో వివేకా రెండో భార్య షమీం కీలక స్టేట్‌మెంట్.. నేరుగా సీబీఐకి వెల్లడి
ABN, First Publish Date - 2023-04-21T15:54:06+05:30
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) రెండో భార్య షమీం సీబీఐకి కీలక స్టేట్‌మెంట్ (Statement) ఇచ్చారు.
హైదరాబాద్: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) రెండో భార్య షమీం సీబీఐకి కీలక స్టేట్‌మెంట్ (Statement) ఇచ్చారు. వివేకాతో తనకు రెండు సార్లు పెళ్లి జరిగిందని తెలిపారు. తమ పెళ్లి వివేకా కుటుంబానికి ఇష్టం లేదని సీబీఐకి తెలిపారు. 2010లో ఒకసారి.. 2011లో మరోసారి వివాహమైందని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. 2015లో తమకు ఓ కుమారుడు జన్మించారని పేర్కొన్నారు. శివప్రకాశ్‌రెడ్డి (Shiva Prakash Reddy) తనను చాలాసార్లు బెదిరించారని పేర్కొన్నారు. వివేకాకు దూరంగా ఉండాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) కూడా హెచ్చరించారని వెల్లడించారు. తన కుమారుడి పేరుతో వివేకా భూమి కొనాలని అనుకున్నారని, అయితే భూమి కొనకుండా శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారని చెప్పారు. చెక్ పవర్ తొలగించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. హత్య కు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని షమీం వెల్లడించారు. బెంగళూరు సెటిల్‌మెంట్‌తో రూ. 8 కోట్లు వస్తాయన్నారని తెలిపారు. ఆయన చనిపోతే శివప్రకాశ్‌రెడ్డిపై భయంతో వెళ్లలేకపోయానని చెప్పారు. వివేకాతో పరిచయం మొదలుకుని ఆయన చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను సీబీఐ (CBI)కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో షమీం ప్రస్తావించారు.
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరిణామం వైఎస్ జగన్ (YS Jagan) చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య. ఊహించని ఈ పరిణామం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వివేకా మృతికి గుండెపోటు కారణమని తొలుత ప్రచారం జరిగినా ఆ తర్వాత నరికి చంపినట్లు.. ఇది పక్కా హత్య అని పోలీసులు నిర్ధారించారు. వివేకా మరణించినట్లు శుక్రవారం ఉదయం (మార్చి 15, 2019) 6:30 గంటలకు గుర్తించారు. ఈ విషయాన్ని మొదట గుర్తించిన పీఏ కృష్ణారెడ్డి మాజీ ఎంపీ అవినాశ్‌కు సమాచారం చేరవేశారు. అంతకు ముందే ఎర్రం గంగిరెడ్డి అక్కడికి వచ్చి వెళ్లారని తెలుస్తోంది. గుండెపోటుతోనే వివేకా మరణించినట్లు బంధువులకు, కుటుంబసభ్యులకు కూడా చెప్పినట్లు సమాచారం.
ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని, ఏ-2గా సునీల్ యాదవ్, ఏ-3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4గా దస్తగిరిని పేర్కొంటూ పులివెందుల కోర్టులో సీబీఐ ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఆ తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అతన్ని ఐదో నిందితుడిగా చేర్చుతూ జనవరి 31, 2022న రెండో చార్జిషీటును పులివెందుల కోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకా కేసులో ఇప్పటివరకు ఏడుగురి అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-04-21T16:04:56+05:30 IST