Elon Musk: మస్క్ మరో సంచలన నిర్ణయం.. ఇక రెండు వారాలే!
ABN, First Publish Date - 2023-05-01T16:11:04+05:30
ట్విట్టర్ (Twitter) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ
న్యూఢిల్లీ: ట్విట్టర్ (Twitter) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ తన చేతికి అందగానే ‘కాస్ట్ కటింగ్’ పేరుతో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’ (New York Times) టెక్ రిపోర్టర్ కేట్ కాంగెర్ ప్రకారం.. ఇప్పటి వరకు 20 వారాలు (నాలుగు నెలలు)గా ఉన్న వేతనంతో కూడిన పేరెంటల్ లీవ్ (Parental Leave)ను రెండు వారాలకు కుదించాలని మస్క్ నిర్ణయించారు.
నిజానికి ఉద్యోగులకు పెయిడ్ లీవ్‌ల విషయంలో అమెరికాలో ఫెడరల్ స్థాయిలో ఎలాంటి చట్టమూ లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉద్యోగుల భద్రత కోసం కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ పేరెంటల్ లీవ్ విధానంలో సవరణలు చేయాలని మస్క్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్ గతంలో 20 వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవు ఇచ్చేదని, ఇప్పుడు రెండు వారాల ‘టాప్ అప్’ లీవ్స్‌తో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలోని చట్టాన్ని బట్టి మార్పులు జరగనున్నాయని ‘అంతర్గత డాక్యుమెంట్ల’ ద్వారా తెలుస్తోందని కాంగెర్ ట్వీట్ చేశారు.
అయితే, పేరెంటల్ లీవ్ విధానంలో మార్పుల గురించి ట్విట్టర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ట్విట్టర్‌ను గత యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థలా నడిపిందంటూ మస్క్ గతంలో ఆరోపించారు. గతేడాది అక్టోబరులో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత సగం మంది సిబ్బందిని మస్క్ తొలగించారు. ఫలితంగా 8 వేలు ఉన్న ఉద్యోగుల సంఖ్య 1,500కు పడిపోయింది. అంతేకాదు, ఉద్యోగులకు చెందాల్సిన పలు ప్రయోజనాల్లోనూ కోత వేశారు.
Updated Date - 2023-05-01T16:11:15+05:30 IST