Adani Ambani: సంపన్న భారతీయుల్లో అంబానీ టాప్.. వారానికి రూ.3 వేల కోట్ల నష్టంతో అదానీ ర్యాంకు ఎంతో తెలుసా..
ABN, First Publish Date - 2023-03-22T17:14:39+05:30
సంపన్న వ్యక్తుల జాబితా ఎప్పుడూ ఆసక్తికరమే. అగ్రస్థానంలో ఎవరున్నారు?. ఎవరి సంపద పెరిగిగింది? ఇంకెవరి ఆస్తి తరిగింది? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలామంది ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. అలాంటివారి కోసం లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది...
ముంబై: సంపన్న వ్యక్తుల జాబితా ఎప్పుడూ ఆసక్తికరమే. అగ్రస్థానంలో ఎవరున్నారు?. ఎవరి సంపద పెరిగిగింది? ఇంకెవరి ఆస్తి తరిగింది? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలామంది ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. అలాంటివారి కోసం రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ ‘హురున్’ (Hurun).. రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎంతో (M3M) కలిసి ‘ది 2023 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ను (The 2023 M3M Hurun Global Rich List) బుధవారం విడుదల చేసింది. గ్లోబల్ టాప్ 10 సంపన్నుల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఒక్కరే నిలిచారు. కాగా భారత్‌లో 82 బిలియన్ డాలర్ల సంపదతో ఇండియన్ బిలియనీర్ల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.7 లక్షల కోట్లుగా ఉంది. ఇక హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో భారీగా సంపదను కోల్పోయిన అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ (Gautham adani) 53 బిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో నిలిచారు. భారతీయ కరెన్సీలో ఈ విలువ రూ.4.3 లక్షల కోట్లుగా ఉంది. ఒకానొక సమయంలో ముకేష్ అంబానీ ఆస్తిని మించి పెరిగిన అదానీ సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత భారీగా తరిగిపోయిందని హురున్ రిపోర్ట్‌ను స్పష్టమవుతోంది.
టాప్-10లో మిగతావారు వీరే..
28 బిలియన్ డాలర్లతో సైరస్ పూనావాలా (Cyrus Poonawalla) మూడవ స్థానంలో, 27 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నడార్ (Shiv Nadar), ఆయన కుటుంబం ఉమ్మడిగా నాలుగవ స్థానంలో నిలిచారు. 20 బిలియన్ డాలర్లతో లక్ష్మీ మిట్టల్ (Lakshmi Mittal) 5వ స్థానంలో నిలిచారని హురున్ రిపోర్ట్ పేర్కొంది. దిలీప్ శాంఘ్వీ అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు, రాధకృష్ణ ధమానీ అండ్ ఫ్యామిలీ 16 బిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా అధినేత కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ 14 బిలియన్ డాలర్లు, కోటక్ మహింద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ 14 బిలియన్ డాలర్ల సంపదతో వరుస ర్యాంకుల్లో నిలిచారు.
అదానీకి వారానికి రూ.3 వేల కోట్ల నష్టం..
అదానీ గ్రూపు స్టాక్ మోసాలు, పన్ను ఎగవేతకు మోసపూరిత విధానాలను అనుసరించిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత అదానీ సంపద విలువ వేగంగా, భారీగా క్షీణించింది. గతేడాదితో పోల్చితే ప్రతి వారం ఆయనకు రూ.3 వేల కోట్లు చొప్పున ఆస్తి పతనం జరిగిందని హురున్ రిపోర్ట్ తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ విలువ ఏకంగా 140 బిలియన్ డాలర్ల మేర పడిపోయినట్టు పేర్కొంది. మరోవైపు ముకేష్ అంబానీ ఆస్తి విలువ ప్రస్తుతం 82 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ.. ఆయన సంపద తగ్గుదల రేటు 20 శాతంగా ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేష్ అంబానీ 9వ స్థానంలో నిలిచారని తెలిపింది. ఇక గౌతమ్ అదానీ సంపద విలువ గతేడాదితో పోల్చితే 35 శాతం మేర క్షీణించిందని, ఈ ప్రభావంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 23వ స్థానానికి పడిపోయారని వివరించింది.
Updated Date - 2023-03-22T17:17:41+05:30 IST