Tata Motors: టియాగో ఈవీ డెలివరీలను ప్రారంభించిన టాటా మోటార్స్
ABN, First Publish Date - 2023-02-10T21:36:04+05:30
టాటా మోటార్స్(Tata Motors) తన టియాగో ఈవీ (Tiago EV) కార్ల పాన్
ముంబై: టాటా మోటార్స్(Tata Motors) తన టియాగో ఈవీ (Tiago EV) కార్ల పాన్ ఇండియా డెలివరీలను ప్రారంభించింది. మొదటి బ్యాచ్‌లో 133 నగరాల్లో 2000 యూనిట్లు పంపిణీ చేసింది. టియాగో ఈవీ కోసం ఇప్పటి వరకు 20 వేల కంటే ఎక్కువ బుకింగులు వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. మొదటి రోజే 10 వేల బుకింగ్స్ వచ్చాయి. ఫలితంగా అత్యంత వేగంగా బుక్ అయిన ఈవీగా టియాగో ఈవీ రికార్డులకెక్కింది.
టియాగో ఈవీలను బుక్ చేసుకున్న తొలి 10 వేల మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయని టాటా తొలుత ప్రకటించింది. అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఈ ఆఫర్‌ను మరో 10 వేలమందికి పొడిగించింది. టియాగో ఈవీ ప్రస్తుత ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 11.79 లక్షలు (ఎక్స్‌షో రూం)గా ఉంది.
టియాగో ఈవీపై వినియోగదారులు చూపిస్తున్న ప్రేమాభిమానాలపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. 133 నగరాల్లో కార్లు రిటైల్ అయినట్టు తెలిపారు. ఈ ఉత్పత్తితో తాము సరైన మార్గంలోనే ఉన్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నట్టు చెప్పారు. ఈ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం సెలబ్రేట్ చేసుకునే విజయానికి కారణమైందని పేర్కొన్నారు.
టియాగో ఈవీని ఎలక్ట్రిక్ ట్రెండ్ సెట్టర్‌గా చెప్పుకోవచ్చు. ఇది ప్రీమియం, భద్రత, సాంకేతిక ఫీచర్లు, పర్యావరణ అనుకూలంగా ఉండడంతోపాటు ఉత్సాహభరితమైన పనితీరును అందిస్తుందని వివేక్ శ్రీవత్స తెలిపారు. ప్రీమియం కార్లలో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి.
Updated Date - 2023-02-10T21:39:44+05:30 IST