Bike race: చెన్నైలో మళ్లీ బైక్ రేస్
ABN, First Publish Date - 2023-04-20T09:13:46+05:30
నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ రేస్(Bike race) నిర్వహించిన ఘటనల్లో 33 మోటర్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- 33 వాహనాల స్వాధీనం
పెరంబూర్(చెన్నై): చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి బైక్ రేస్(Bike race) నిర్వహించిన ఘటనల్లో 33 మోటర్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పందేలు పెట్టుకొని నిర్వహిస్తున్న బైక్ రేస్‌లతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతుండగా, మరికొన్ని ఘటనలో మితిమీరిన వేగంతో రేస్‌లో పాల్గొన్నవారు ప్రమాదానికి గురై మృతి చెందిన, గాయపడిన ఘటనలు ఉన్నాయి. ఈ బైక్ రేస్‌లు అడ్డుకొనేలా ట్రాఫిక్ పోలీసులు రాత్రి వేళల్లో మెరీనా, శాంథోమ్, అడయార్, వండలూరు-మీంజూరు బైపాస్ రోడ్ల(Vandalur-Meenjoor Bypass Roads)పై గస్తీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న యువకులు అన్నాసాలై, తేనాంపేట, వళ్లువర్‌కోట్టం, చింతాద్రిపేట ప్రాంతాల్లో బైక్ రేస్, సాహసాలకు పాల్పడిన వ్యవహారంలో 33 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
14 ఏళ్ల బాలుడి మృతి...
ఆలందూర్ సబ్‌వే ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 14 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు బాలురు హెల్మెట్ లేకుండా మితిమీరిన వేగంతో బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనపై అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో బాలుడికి చేతులు విరిగాయి. ఈ ఘటనపై సెయింట్ థామస్ మౌంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-04-20T09:13:46+05:30 IST