Chennai: దేవుడా.. ఏమిటిది?!
ABN, First Publish Date - 2023-04-06T10:32:33+05:30
దేవుని తీర్థవారి ఉత్సవంలో నీటమునిగి ఐదుగురు యువ పూజారులు దుర్మరణం చెందారు. చెంగల్పట్టు(Chengalpattu)
చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేవుని తీర్థవారి ఉత్సవంలో నీటమునిగి ఐదుగురు యువ పూజారులు దుర్మరణం చెందారు. చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా మువరసంబట్టు గ్రామంలో వున్న ధర్మలింగేశ్వరాలయ(Dharmalingeshwaralaya) తీర్థవారి వేడుకల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చెన్నై మడిపాక్కం సమీపంలోని నంగనల్లూరులోని ధర్మలింగేశ్వరాలయంకి 400 మీటర్ల దూరంలో తీర్ధ కొలనులో ఈ విషాదం జరిగింది. బుధవారం పంగుణి ఉత్తిరం సందర్భంగా ఆలయంలో తీర్థవారి వేడుకలు వేకువజామున ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణలతో అలంకరించి తీర్థవారి వేడుకలకు ప్రధాన పూజారుల సహా సుమారు 25 మంది అర్చకులు సిద్ధమయ్యారు. ఉదయం 9.30 గంటలకు ఆ ఆలయానికి చేరువగా ఉన్న మూవరసంబట్టులోని తీర్థకొలనుకు పల్లకీపై ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఉత్సవమూర్తులను తీర్థకొలనులో ముంచే సమయంలో అందరూ స్వామివారి నామం ఉచ్ఛరిస్తూ నీట మునిగారు. ఆ సమయంలో ఊహించని విధంగా సూర్య(22) అనే అర్చకుడు నీట మునిగి కొలను మధ్య ప్రాంతానికి కొట్టుకెళ్లాడు. గమనించిన తోటి అర్చకులు బాణేష్(22), రాఘవన్(22), యోగేశ్వరన్(21), రాఘవన్(18) అతన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారు కూడా కొలను మధ్యకు వెళ్లిపోయారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడం, వారెవ్వరికీ ఈత రాకపోవడంతో అందరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన చుట్టుపక్కల పూజారులంతా బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక దళం సభ్యులు హూటాహూటీన అక్కడికి చేరుకునేప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొలను మధ్యలోకి వెళ్లిన ఐదుగురూ ప్రాణాలు విడిచారు. దీంతో వారి మృతదేహాలను పోలీసులు బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొలనులో మునిగి మృతి చెందిన ఐదుగురిలో యోగేశ్వరన్ కీల్‌కట్టలై ప్రాంతానికి, బాణేష్, సూర్యా, రాఘవన్ నంగనల్లూరు ప్రాంతానికి, రాఘవ్ మడిపాక్కంకు చెందినవారు. వీరంతా 18 నుండి 22 యేళ్లలోపువారే. మార్చి 26న ఆ ఆలయంలో పంగుణి ఉత్తిర బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
పూడిక తీయని కొలను...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ కొలనులో బురదనీరంతా చేరిందని చెబుతున్నారు. కొలనులో పూడిక తీయాలంటూ స్థానిక భక్తులు, ప్రజలు చేసిన విజ్ఞప్తిని అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో లోతు అధికంగా ఉన్న కొలను మధ్య బురద ఎక్కువగా ఉన్న కారణం వల్లే ఐదుగురు బురదలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కాగా.. ఈ సంఘటన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి ప్రకటించారు. మృతిచెందినవారి కుటుంబీకులకు, బంధువులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. మృతి చెందిన ఐదుగురి కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు ఉత్తర్వు జారీ చేసినట్లు స్టాలిన్ ఆ సందేశంలో తెలిపారు.
Updated Date - 2023-04-06T10:32:33+05:30 IST