DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదుగా.. దేశం వీడిచిపోయేందుకు రూ.5 కోట్ల బేరం మాట్లాడుకుని...
ABN, First Publish Date - 2023-04-20T07:45:35+05:30
కంచే చేనుమేసింది. అక్రమార్కులను అడ్డుకోవాల్సిన ఖాకీయే వారిని తప్పించేందుకు ప్రయత్నించింది.
అడయార్(చెన్నై): కంచే చేనుమేసింది. అక్రమార్కులను అడ్డుకోవాల్సిన ఖాకీయే వారిని తప్పించేందుకు ప్రయత్నించింది. ఇందుకు భారీ మొత్తాన్ని లంచంగా తీసుకునేందుకు సిద్ధమై కటకటాల పాలైంది. అనేక మంది డిపాజిట్‌దార్లకు కుచ్చుటోపీ పెట్టిన ఐఎఫ్ఎస్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించిన డీఎస్పీ(DSP)ని ఆర్థిక నేరాల విభాగం ఏడీజీపీ సస్పెండ్ చేశారు. ఈ ఫైనాన్స్ కంపెనీ(Finance Company) డైరెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వారు దేశ సరిహద్దులు దాటిపోయేలా సహకరించేందుకు రూ.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా రూ.30 లక్షల అడ్వాన్స్ పుచ్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఏడీజీపీ తక్షణ చర్యలు చేపట్టారు.
వేలూరు జిల్లా కాట్పాడి కేంద్రంగా ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ నిధి అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, దేవ్ నారాయణన్, మోహన్ బాబు, జనార్దనన్. వీరంతా అన్నదమ్ములే. వీరు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు(Chennai, Kanchipuram, Tiruvallur), తిరువణ్ణామలై, విల్లుపురం, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను నెలకొల్పారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ ఫైనాన్స్ కంపెనీలో నెలకు రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఆరు నుంచి 10 శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేశారు. దీంతో 2018 నుంచి 2022 జూలై నెల వరకు 82 వేలమంది రూ.5,900 కోట్లను డిపాజిట్ చేశారు. ప్రచారం చేసినట్టుగా తొలి నెలలో మాత్రం పక్కాగా వడ్డీ చెల్లించిన నిర్వాహకులు.. ఆ తర్వాత మానేశారు. దీంతో ఈ ఫైనాన్స్ కంపెనీపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఒకేసారి వేలాదిమంది బాధితులు ఫిర్యాదులు చేయడంతో డీజీపీ శైలేంద్రబాబు జోక్యం చేసుకుని, ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం విచారణకు ఆదేశించారు. దీంతో ఆ విభాగం ఏడీజీపీ అభిన్ దినేష్ ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ చేపట్టగా రూ.5900 కోట్ల మేరకు వసూలు చేసినట్టు తేలింది. దీంతో కంపెనీ డైరెక్టర్లతో పాటు 10 మంది డైరెక్టర్లు, ముగ్గురు ప్రధాన ఏజెంట్లు ఇలా మొత్తం 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు ఏజెంట్లను మాత్రం పోలీసులు అరెస్టు చేయగా, కంపెనీ వ్యవస్థాపకులు మాత్రం విదేశాలకు పారిపోయారు. వీరికోసం పోలీసులు రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేశారు. అలాగే, కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాల నుంచి రూ.121.54 కోట్లను సీజ్ చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపగా, ఈ ఫైనాన్స్ కంపెనీ వ్యవస్థాపకులు విదేశాలకు పారిపోయేందుకు సహకరించేందుకు స్థానిక డీఎస్పీ కబిలన్ రూ.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తేలింది. అందులో రూ.30 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ఇదికూడా చదవండి: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం!
Updated Date - 2023-04-20T07:45:35+05:30 IST