Bihar Road Horror: బీహార్‌లో ఢిల్లీ సీన్ రిపీట్.. 70 ఏళ్ల వృద్ధుడిని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
ABN, First Publish Date - 2023-01-22T15:28:56+05:30
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 1న జరిగిన అంజలి సింగ్ (Anjali Singh) రోడ్డు ప్రమాద ఘటనను మర్చిపోకముందే అలాంటి ఘటనే ఒకటి
పట్నా: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 1న జరిగిన అంజలి సింగ్ (Anjali Singh) రోడ్డు ప్రమాద ఘటనను మర్చిపోకముందే అలాంటి ఘటనే ఒకటి బీహార్(Bihar)లో జరిగింది. కారు ఢీకొట్టడంతో బానెట్‌పై పడిన 70 ఏళ్ల వృద్ధుడిని 8 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. ఆపై సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎగిరి కిందపడిన వృద్ధుడిని తొక్కించుకుపోయాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు మృతి చెందాడు.
ఈస్ట్ చంపారన్ జిల్లాలోని జాతీయ రహదారి 27పై జరిగిందీ అమానుష ఘటన. బాధితుడిని కొత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్రా గ్రామానికి చెందిన శంకర్ చౌధుర్‌గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బంగ్రా చౌక్ వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతున్న శంకర్‌ను గోపాల్‌గంజ్ పట్టణం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు కారు బానెట్‌పై పడి వైపర్‌కు చిక్కుకుపోయాడు.
కారు ఆపమని భయంతో అతడు కేకలు వేస్తున్నప్పటికీ డ్రైవర్ పట్టించుకోలేదు సరికదా కారు వేగం మరింత పెంచాడు. రోడ్డు పక్కన చూస్తున్న వారు కారు ఆపాలంటూ పెద్దగా అరిచినా పట్టించుకోకుండా దూసుకెళ్లాడు. కొందరైతే కారును వెంబడించి ఆపాలని కోరారు. తన కారును కొందరు వెంబడిస్తున్న విషయం తెలుసుకున్న డ్రైవర్ కొత్వాలోని కదమ్ చౌక్ వద్ద సడన్‌గా బ్రేకులు వేశాడు. దీంతో కారు బానెట్‌పై చిక్కుకుపోయిన శంకర్ చౌధుర్ ఎగిరి కారు ముందు పడ్డాడు. ఇదేమీ పట్టించుకోని డ్రైవర్ వృద్ధుడి పైనుంచే కారును పోనిచ్చాడు. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు జాతీయ రహదారి 27పై ఉన్న పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. చివరికి పిప్రాకోఠి పోలీసులు కారును సీజ్ చేశారు. అయితే, డ్రైవర్, అందులో ఉన్న వారు పరారయ్యారు. కారు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీలో జనవరి 1న జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. స్కూటర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల అంజలి సింగ్‌ను ఢీకొట్టిన కారు.. ముందు టైరు వెనక చిక్కుకుపోయిన ఆమెను దాదాపు 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు మృతి చెందింది. ఛిద్రమైన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది.
Updated Date - 2023-01-22T15:28:58+05:30 IST