ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Education: విద్యార్థుల డబ్బంతా టీ, కాఫీలకు కరిగిపోతున్నాయి

ABN, First Publish Date - 2023-08-14T11:58:36+05:30

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులను పప్పుబెల్లాల మాదిరిగా మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ చప్పరించేస్తోంది. నీరు నుంచి తేనీరు వరకు, స్టేషనరీ నుంచి దినపత్రికల బిల్లుల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇష్టారీతిగా ఖర్చు చేసేస్తున్నారు. ఇక, ఉన్నతాధికారుల ప్రయాణ ఖర్చులు, కారు నిర్వహణ ఖర్చులు అంటూ.. ఉన్నత విద్యామండలి ఖాతాను ఖాళీ చేసేపనిని నిరాఘాటంగా సాగిస్తున్నారు.

విద్యార్థుల ఫీజులతో ఎంజాయ్‌!

మంత్రి బొత్స పేషీ ఖర్చుకు ఉన్నత విద్యా మండలి నిధులు

టీ, కాఫీలు, పేపర్లకూ ఇవే నిధులు

ప్రతినెలా స్టేషనరీ ఖర్చే రూ.80 వేలు

ఒక్క ‘బాదం టీ’ ఖర్చే రూ.8,800

మంత్రి ఓఎస్డీ జీతమూ అక్కడి నుంచే

ముఖ్య కార్యదర్శికి విమానం టికెట్లు

ఆయన అటెండర్లకూ జీతాల చెల్లింపు

భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులను పప్పుబెల్లాల మాదిరిగా మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ చప్పరించేస్తోంది. నీరు నుంచి తేనీరు వరకు, స్టేషనరీ నుంచి దినపత్రికల బిల్లుల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఇష్టారీతిగా ఖర్చు చేసేస్తున్నారు. ఇక, ఉన్నతాధికారుల ప్రయాణ ఖర్చులు, కారు నిర్వహణ ఖర్చులు అంటూ.. ఉన్నత విద్యామండలి ఖాతాను ఖాళీ చేసేపనిని నిరాఘాటంగా సాగిస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజులతో సమకూరిన నిధులు పక్కదారి పడుతున్నాయి. విద్యా సంబంధిత అవసరాలకు కాకుండా ఉన్నత విద్యామండలి ఇష్టానుసారం ఇతర అవసరాలకు మళ్లిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీనిలో మెజారిటీ వాటా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ ఖర్చులకే వెళ్తున్నాయి. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ప్రయాణ ఖర్చులు, ఆయన సిబ్బంది జీతాలకూ ఇవే నిధులు చెల్లిస్తున్నారు. గతంలో ఉన్నత విద్యామండలి నిధుల పక్కదారిపై గగ్గోలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అడ్డగోలుగా నిధులను ఖర్చులు చేస్తోంది. ఉన్నత విద్యాశాఖలో ఏ అవసరం ఉన్నా వెంటనే ఉన్నత విద్యామండలి నుంచే నగదు చెల్లించే పరిస్థితి వచ్చింది. ఉన్నత విద్యామండలిలో కొద్దిమందికి జీతాలు మినహా ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కేటాయించదు. కానీ, ఎంసెట్‌, ఈసెట్‌, పీజీసీసెట్‌ లాంటి అన్ని సెట్ల నిర్వహణ మండలి ద్వారానే జరుగుతుంది. ఆయా సెట్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు చెల్లించే ఫీజులతో మండలి నిర్వహణ సాగుతుంది. చైర్మన్‌ సహా కొద్దిమందికి ప్రభుత్వం జీతాలిస్తే డెప్యుటేషన్‌పై పనిచేసేవారు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మండలే వేతనాలు చెల్లిస్తుంది. విద్యా సంబంధిత అంశాలకు కూడా నిధులు వెచ్చిస్తుంది.

ఏడాదిన్నర నుంచి

సుమారు ఏడాదిన్నర నుంచి ఉన్నత విద్యామండలి నిధులను మంత్రి సేవలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బొత్స పేషీలో ఖర్చులకు సంబంధించిన బిల్లులను మండలి చెల్లిస్తోంది. మంత్రి కార్యాలయం తాగునీటి బిల్లుకు ప్రతినెలా రూ.25 వేలు చెల్లిస్తోంది. స్టేషనరీ ఖర్చుకు రూ.80 వేలు, టీలు, కాఫీలకు బిల్లులు, అలాగే మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తున్న రిటైర్డ్‌ అధికారికి నెలకు రూ.1.05 లక్షల జీతం, ఆయన కారు నిర్వహణ బిల్లు మండలి నిధుల నుంచే ఇస్తున్నారు. చివరికి మంత్రి పేషీలో ‘బాదం టీ’కి రూ.8,800 బిల్లు కూడా మండలి నుంచే తీసుకోవడం గమనార్హం. మంత్రి కార్యాలయానికి వినియోగించే మరో కారు బిల్లు కూడా ఇందులోనే పెట్టారు. మంత్రి కార్యాలయంలో ప్రతినెలా స్టేషనరీ ఖర్చుకే రూ.80 వేలకు పైగా బిల్లు పెడుతున్నారు. ఈ నిధులన్నీ ప్రభుత్వం నుంచి సమీకరించుకోవాల్సి ఉండగా ఉన్నత విద్యామండలిని ఈ బిల్లుల చెల్లింపులకు కేంద్రంగా మార్చేశారు.

ముఖ్య కార్యదర్శికి కూడా..

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు విదేశాలకు వెళ్లాల్సిన సమయంలో వీసా పనిపై హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన హైదరాబాద్‌ వెళ్లొచ్చేందుకు, వసతికి అయిన ఖర్చును మండలి తన ఖాతా నుంచి చెల్లించింది. అలాగే, ఆయన కార్యాలయంలో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లకు కూడా ఇక్కడి నుంచే జీతాలు ఇస్తున్నారు. వీరితో పాటు నిపుణుల పేరుతో నియమించుకున్న కొందరు ప్రైవేటు వ్యక్తులకు కూడా జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. వారి జీతాలు ఐఏఎస్‌ అధికారుల కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే వారికి అవసరమైన ల్యాప్‌ట్యా్‌పలు, సాంకేతిక ఉపకరణాలను కూడా మండలి నిధులతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నిధులను కూడా సచివాలయ నిర్వహణ నిధుల నుంచి తీసుకోవాలి. కానీ ఆర్థికశాఖ నుంచి ఆలస్యం అవుతుందని, ఉన్నత విద్యామండలి అయితే అడిగిన వెంటనే చెల్లిస్తుందని ఇలా బిల్లులు పెడుతున్నారు.

ఖాతా ఖాళీ చేస్తారా?

ఉన్నత విద్యామండలికి విద్యార్థుల ఫీజులు తప్ప మరో రాబడి మార్గం లేదు. ఏటా వారు ఫీజులు కడితేనే మండలి నిర్వహణ సాగుతుంది. కాగా, ఇటీవల కాలంలో మండలి నుంచి జీతాల చెల్లింపు ఖర్చులు పెరిగాయి. యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పేరుతో కొత్తగా తీసుకుంటున్న వారికి నెలకు రూ.లక్షకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. ఐటీ నిపుణులు అంటూ అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులను మండలిలో నియమించి జీతాలు ఇస్తున్నారు. అలాగే, ఓవైపు జీతాలు తీసుకునే వారికి కూడా సెట్ల నిర్వహణ నిధుల నుంచి పారితోషికాలు ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. పరిస్థితి చూస్తుంటే మండలి ఖాతా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-08-14T11:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising