Gurukula teachers special: ఆ రెండింటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం
ABN, First Publish Date - 2023-07-10T17:08:01+05:30
సహజంగా మనిషి సృజనాత్మకతకు సాహిత్యం కొలమానంగా గుర్తింపు పొందుతుంది. నాగరికత ఉత్పత్తి సాధనాలకు చిహ్నమైతే, సంస్కృతి మానవ జీవనానికి దర్పణం వంటిది. ప్రతి పోటీ పరీక్షలో సమాజ నాగరికత, సంస్కృతులపై ప్రశ్నలు అడుగుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్, గురుకుల్ బోర్డు సిలబస్‌లలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యం లభించింది.
సహజంగా మనిషి సృజనాత్మకతకు సాహిత్యం కొలమానంగా గుర్తింపు పొందుతుంది. నాగరికత ఉత్పత్తి సాధనాలకు చిహ్నమైతే, సంస్కృతి మానవ జీవనానికి దర్పణం వంటిది. ప్రతి పోటీ పరీక్షలో సమాజ నాగరికత, సంస్కృతులపై ప్రశ్నలు అడుగుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్, గురుకుల్ బోర్డు సిలబస్‌లలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యం లభించింది.
తెలంగాణలో తెలుగు భాష ఆవిర్భావం, వికాసం మొదలైన అంశాలు చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. ఆధునిక యుగ ఆరంభానికి ముందు ఈ భౌగోళిక ప్రాంతంలో సాహిత్య పరిణామక్రమాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది. తెలుగు భాష మూలాలు ప్రాచీన గోండు భాషలో ఉన్నాయి. ప్రాథమికంగా ఇది ద్రవిడ భాషా కుటుంబానికి(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) చెందింది.
బ్రిటిష్ పరిపాలన కాలానికి చెందిన ఒక చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష మూలాలు ద్రవిడ భాష కుటుంబంలో ఉన్నాయి. బ్రహ్మి లిపి తెలుగు భాష లిపితో సంబంధం కలిగి ఉంది. తెలుగు భాష ‘అజంత భాష’గా గుర్తింపు పొందింది(అచ్చుశబ్ధంలో ముగుస్తుంది). దీనిని తూర్పు ఇటాలియన్ భాషగా కూడా పిలుస్తారు. ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. తెలుగు సాహిత్యంపై బౌద్ధ, జైన మతాల ప్రభావం ఉన్నది. తెలుగు భాషా సాహిత్యం వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది. తెలుగు భాష అక్షరాలు బ్రహ్మి లిపి నుంచి ఉద్భవించాయి. తెలుగును మొదట తెలంగాణలోనే వాడారు. కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలలో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేలపై గోబధ, నారణ, సిరివాయన, కంపాయన అనే పదాలు కనిపించాయి. ఇవన్నీ తెలుగులో మొదటి పదాలు. మొదటి అక్షరం ‘న’. నారణ అంటే నరుడు అని అర్థం. తరవాత మెల్లమెల్లగా ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించింది.
తెలంగాణ సాహిత్య చరిత్ర 1 నుంచి 10వ శతాబ్దం వరకు
ఒకటవ శతాబ్దంలో పైశాచిక భాషను ఉపయోగించారు. ‘బృహత్కథ’ను గుణాడ్యుడు పైశాచిక భాషలో రాశాడు. ‘గాథాసప్తశతి’ని ప్రాకృత భాషలో రాశారు. ఇక్ష్వాకుల కాలంలో జైనమత ప్రభావంతో నయసేన ‘దైవామృతం’ను రాశాడు. విష్ణుకుండినుల కాలంలో మొదటి గోవింద వర్మ ‘చైతన్యపురి శాసనం’ ప్రాకృత భాషలో ఉంది. రెండో మాధవ వర్మ కాలంలో ‘జనాశ్రేయ చంధోవిచ్ఛిత్తి’ సంస్కృతంలో ఉంది. వేములవాడ, ముదిగొండ చాళుక్యుల కాలంలో తెలుగు వికసించింది. ముదిగొండ చాళుక్యుల రాజు నిరావద్యుడు వేయించిన ‘కొరవి శాసనం’ మొదటి గద్య శాసనం.
వేములవాడ చాళుక్యుల రాజు రెండో అరికేసరి కాలంలో జీన వల్లభుడి ‘కురిక్యాల శాసనం’ మొదటి పద్య కవితా శాసనం.
వేములవాడ రెండో అరికేసరి కాలంలో మొదటి కన్నడ కవి అయిన పంపకవి ఆదిపురాణమును(జైన పురాణం), విక్రమార్జున విజయాలను రాశాడు. పంప, పొన్న, రన్నలను కన్నడ కవిత్రయం అంటారు. ధర్మపురి గ్రామమును పంప కవికి బహుమానంగా ఇచ్చారు.
వేములవాడ చాళుక్యుల కాలంలో వాగరాజు ఆస్థాన కవి అయిన ‘సోమరాజు సోమదేవర సూరి’ ‘నీతి అమృతం’ మొదలైన రచనలు చేశాడు. ఇతడు జైనమత గురువు.
సుమతీ శతకమును బద్దెన రాశాడు. పొన్నకవి ‘గదాయుద్ధము’ను కన్నడ భాషలో రాశాడు. ఇది కళ్యాణి చాళుక్యుల చరిత్రను వివరిస్తుంది.
జనగామ జల్లాలోని గూడూర్ గ్రామంలో ఉన్న ‘గూడూర్ శాసనం’ మొదటి తెలుగు వృత్త కవితా/కావ్య శాసనం. ఇది మల్లేశ్వర స్వామిపై గౌరవ సూచకంగా ‘విర్యాల కుమార స్వామి’రాశాడు. దీనితో కాకతీయుల చరిత్ర వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ చరిత్రలో 1 నుంచి 10వ శతాబ్దాల్లో, జైనమత ప్రభావం బాగా ఉండేది. కాబట్టి ఈ సాహిత్యం జైనమత సాహిత్యంగా గుర్తింపు పొందింది.
శివ సాహిత్యం
11, 12వ శతాబ్దాల కాలంలో బసవేశ్వరుని ప్రభావంతో శివవాదం తెలంగాణలో వ్యాపించింది. మల్లిఖార్జున పండితుడు సాహిత్యంలో శివవాదం అనే పునాదిని వేశాడు. ఇతడు ‘శివతత్వ సారం’’ రాశాడు. ఈ వాదంలో ముఖ్యమైన కవులు ముగ్గురున్నారు. వీరిని పండిత త్రయం అంటారు. వారు ...మల్లిఖార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, శివలెంకి మంచన పండితుడు. పాల్కురికి సోమనాధుడు వీరితో ప్రభావితమయ్యాడు.
పాల్కుర్కి సోమనాధుడు: ఇతడిని తెలుగు భాషా సాహిత్యంలో ఆదికవి అని చెప్పవచ్చు.తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో మొదటి దేశీ పురాణం, చరిత్ర కావ్యాన్ని, శతకాన్ని రాశాడు. 30కి పైగా తెలుగు, కన్నడ, సంస్కృతంలో రచనలు చేశాడు. చతుర్వేద సారం, అనుభవ సారం, బసవ పురాణం, వృష-దిపశతకం(బసవోద్ధరణ) బసవ ఉచ్ఛారణ, బసవ రగడ, పండితారాధ్య చరిత్ర మొదలైనవి ఇతడి రచనలు.
కాకతీయ పాలనలో సాహిత్యం ప్రబంధాలు
1. నీతి సారము - రుద్రదేవుడు
2. శివయోగ సారము - కొలను గణపతి దేవుడు
3. నృత్య రత్నావళి - జాయాప సేనాని
4. గీత రత్నావళి - జాయాప సేనాని
5. వాయిద్య రత్నావళి - జాయాప సేనాని
6. పురుషార్థ సారము - సిద్ద దేవయ్య
7. జీనేంద్ర కళ్యాణ అభ్యుదయం - అప్పయ్య చార్యుడు
బసవేశ్వరుని కారణంగా శైవమతం కాకతీయుల పాలన కాలమంతా వ్యాప్తి చెందింది. తరవాత కాలంలో వైష్ణవం వ్యాప్తి చెందుతూ, దాని ప్రభావం సాహిత్యంలోకి కూడా ప్రవేశించింది.
గోన బుద్దారెడ్డి: ఇతడు ద్విపద రామాయణం అయిన రంగనాథ రామాయాణాన్ని రచించాడు. ఇది తెలుగులో మొట్టమొదటి రామాయణం. ఇతడి కుమారులు కాచంరెడ్డి, విఠల్ రెడ్డి ఉత్తర రామాయణం రాశారు. ఇతడి కుమార్తె కుప్పాంబ కాకతీయుల కాలంలో సైనిక అధికారి అయిన ముత్యాల గుండడు భార్య. ఈమె మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్‌పూర్ దగ్గర ‘భూత్‌పూర్ శాసనం’ వేయించింది.
మొల్ల: కుమ్మరి(కులములో) కుటుంబంలో జన్మించిన స్ర్తీ. మొల్ల రామాయణం రాసింది. ఇది స్త్రీలు రాసిన రామాయణంలో మొదటిది.
తెలుగులో మొట్టమొదటి పద్య రామాయణాన్ని హుళక్కి భాస్కరుడు రాశాడు. దీనిని భాస్కర రామాయణం అని పిలుస్తారు.
కొందరు చరిత్రకారుల అభిప్రా యం ప్రకారం అయోధ్య కాండను రెండవ ప్రతాపరుద్రుడు రాశాడు. విద్యానాధుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ పేరుతో మొట్టమొదట అలంకార పుస్తకం రాశాడు.
Updated Date - 2023-07-10T17:08:01+05:30 IST