TSPSC Special: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్
ABN, First Publish Date - 2023-01-02T15:40:23+05:30
తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలం నుంచే నీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యం కల్పించారు. రామప్ప, పాకాల, లక్నవరం వంటి సరస్సులను ఈ కాలంలోనే నిర్మించారు. నిజాం పాలకుల
టీఎస్‌పీఎస్సీ / పోలీసు పరీక్షల ప్రత్యేకం
తెలంగాణ జాగ్రఫీ
తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు
తెలంగాణ(Telangana) ప్రాంతంలో కాకతీయుల కాలం నుంచే నీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యం కల్పించారు. రామప్ప, పాకాల, లక్నవరం వంటి సరస్సులను ఈ కాలంలోనే నిర్మించారు. నిజాం పాలకుల కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రంలో అనేక బహుళార్ధక సాధక ప్రాజెక్టులను నిర్మించారు.
అప్పర్ మానేర్ ప్రాజెక్టు
గోదావరి(Godavari)కి మరో ఉపనది మానేర్. దీనిపై సిరిసిల్ల జిల్లాలోని కుడులేరు వాగు మానేరులో కలిసే చోట నర్మాల గ్రామం వద్ద అప్పర్ మానేర్ డ్యాం నిర్మించారు. 6.47 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టు స్థలం వద్ద మానేరులో అందుబాటులో ఉంది. ఈ నీటితో 32 వేల నుంచి 38 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నిజాం ప్రభుత్వం సంకల్పించింది. చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆదేశంపై ఇంజనీర్ ఖాజా అజీముద్దీన్ ఈ ప్రాజెక్టు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ తర్వాత ముందుగా ఎంపిక చేసిన స్థలానికి రెండు మైళ్ల ఎగువన 17,680 ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1945లో ప్రాజెక్టు నిర్మాణం మొదలై 1952లో పూర్తయింది. ముఖ్య పనులన్నీ 1949లోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా అనేక చెరువులను నీటితో నింపారు.
తుంగభద్ర జలాల కోసం ఒప్పందాలు, ప్రాజెక్టు నిర్మాణం
కృష్ణానది(Krishna River)కి ఉపనది అయిన తుంగభద్ర నదీ జలాలను మద్రాసు, హైదరాబాద్(hyderabad) రాష్ట్రాలు సమష్టిగా వినియోగించుకోవడానికి 1920-30లో నవాబ్ జంగ్ అలీ నవాజ్ జంగ్ సారథ్యంలో సంబంధిత రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య చర్చలు జరిగాయి. 1930 అక్టోబరు 27న కృష్ణా నది దిగువన, ఎగువన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సర్వే చేయాలని నిర్ణయించారు. 1933లో మల్లాపురం వద్ద తుంగభద్ర డ్యాం నిర్మాణానికి బొంబాయి, మద్రాసు, మైసూరు, హైదరాబాద్ రాష్ట్రాలు ఒక స్థూల అవగాహనకు వచ్చాయి. 1944 జూన్ 24-26 తేదీల్లో ఈ రాష్ట్రాల ప్రతినిధుల మధ్య ఒక అంగీకారం కుదిరింది. 1945 ఫిబ్రవరి 28న తుంగభద్ర డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1946 అక్టోబరు 16న ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మద్రాసు- మైసూరు, మద్రాసు- హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలను ఆమోదించారు. అంతకు ముందే 1938లో రాజోలిబండ డైవర్షన్ స్కీం గురించి మద్రాసు- హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య స్థూల అంగీకారం కుదిరింది. అప్పటి మద్రాసు రాష్ట్రంలోని కడప-కర్నూలు కాలువ స్థాయిలో రాజోలిబండకు సాగునీరు ఇవ్వాలని హైదరాబాద్ ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వాన్ని కోరింది. రాజోలిబండ ప్రతిపాదిత స్థలం వద్ద తుంగభద్ర నదిలో 336 టీఎంసీల నీరు లభిస్తుందని అంచనా వేసి కర్నూలు - కడప కాల్వకు, రాజోలిబండ కాల్వకు చెరి 65 టీఎంసీల నీరు వాడుకోవడానికి మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో గద్వాల జిల్లాలోని నడిగడ్డగా పిలిచే గద్వాల, అలంపూర్ తాలూకాల్లోని 87,500 ఎకరాలకు సాగునీరందించే రాజోలిబండ డైవర్షన్ స్కీం ప్రాజెక్టును నిజాం ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు
నాగార్జున సాగర్
ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. మొత్తం 8.95 లక్షల హెక్టార్ల నీటి వసతిని కల్పిస్తోంది. దీన్ని కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాల మధ్య నిర్మించారు. 1955 డిసెంబరు 10న దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) శంకుస్థాపన చేశారు. దీన్ని 1967 ఆగస్టు 4న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన, అతి ఎత్తయిన రాతి ఆనకట్టతో నిర్మితమైన ప్రాజెక్టు. కృష్ణా నదిపై నందికొండ గ్రామం(నల్లగొండ) వద్ద నిర్మించారు. దీని నిర్మాణ ఇంజనీరు కానూరి లక్ష్మణ రావు. ప్రాజెక్టు మొదటి చీఫ్ ఇంజనీర్ జాఫర్ అలీ. డ్యామ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెహ్రూ Everything can be stopped. But not Agriculture అని వ్యాఖ్యానించారు. ఈ దీని ఎత్తు 124.7 మీటర్లు, పొడవు 1550 మీ. నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు. స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 816 మెగా వాట్లు. మొత్తం ఆయకట్టు 21.57 లక్షల ఎకరాలు. తెలంగాణలో 6,30,089 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుకు రెండు కాల్వలు ఉన్నాయి.
1. కుడి కాలువ- జవహర్‌లాల్ నెహ్రూ కాలువ: ఆంధ్రప్రదేశ్‌కి నీరు అందిస్తుంది. దీని పొడవు 203 కి.మీ. ఏపీలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
2. ఎడమ కాలువ-లాల్ బహదూర్ శాస్త్రి కాలువ: తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు; ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగు నీటిని అందిస్తుంది. దీని పొడవు 296 కి.మీ. దీని ద్వారా 10.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలో మానవ నిర్మిత సరోవరాల్లో మూడో అతి పెద్దది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌ఎస్‌పీ)
గతంలో దీన్ని పోచంపాడు ప్రాజెక్టుగా వ్యవహరించేవారు. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1963 జూలై 26 న ప్రారంభించారు. గోదావరినదిపై తెలంగాణలో ఇది మొట్టమొటి ప్రాజెక్టు. 1978లో నిర్మాణం పూర్తి చేసి తొలి సారిగా 25 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్(అర్బన్, రూరల్) సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని సాగుభూమికి నీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ‘కాకతీయ కాలువ’ ప్రధాన కాలువ. దీనితోపాటు సరస్వతి, లక్ష్మీ కాలువలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు జలాశయం గరిష్ఠ ఎత్తు 1,091 అడుగులు. దీని నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపు అడుగులు(టీఎంసీలు). ఈ ప్రాజెక్టుకు మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉంది. ఇది ప్రారంభంలో కేవలం నీటి పారుదల ప్రాజెక్టుగానే సేవలందించింది. ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్ హయాంలో దీన్ని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుగా రూపొందించారు. ప్రాజెక్టుకు కుడి వైపున జల విద్యుత్ కేంద్రాన్ని 36 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేస్తున్నారు.
మొదటి దశ: ఈ దశలో కాకతీయ కాలువ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్(అర్బన్, రూరల్) సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని 9.69 లక్షల ఎకరాలకు నీటి పారుదల వసతులు కల్పించడంతోపాటు కరీంనగర్, వరంగల్ నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-1 పనులు పూర్తిచేశారు. తద్వారా 9.7 లక్షల ఎకరాలకు నీటిని అందించే సామర్థ్యం కలిగింది. కాకతీయ కాలువ తెలంగాణలో అతి పొడవైన(284 కి.మీ.) నీటి కాలువ. దీని ద్వారా 9,11,430 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. సరస్వతి కాలువ మొత్తం పొడవు 47 కి.మీ. దీని ద్వారా నిర్మల్ జిల్లాలో 34,967 ఎకరాలకు సాగునీరు అందుతోంది. లక్ష్మీ కాలువ పొడవు 47 కి.మీ. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలో 21,866 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
రెండో దశ: ప్రాజెక్టు రెండో దశను 2006లో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం కాకతీయ కాలువ పొడవుని 284. కి.మీ. నుంచి 346 కి.మీ.కి పొడిగించడం. కొత్తగా 4,40,000 ఎకరాలకు సాగునీటిని అందించడం.
వరదకాలువ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించడం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని సంగం గ్రామంలో ప్రారంభమై మిడ్ మానేరు డ్యామ్(మానువాడ గ్రామం - రాజన్న సిరిసిల్ల జిల్లా) వద్ద ముగుస్తుంది. ఈ కాలువ పొడవు 130 కి.మీ. దీని ఆయకట్టు 2,20,000 ఎకరాలు. ఈ కాలువ ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు లబ్ధి పొందుతాయి.
-వి.వెంకట్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ
Updated Date - 2023-01-02T15:41:00+05:30 IST