ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brahmanandam Karnataka Election Campaign: కర్ణాటకలో సుధాకర్ ఒక్కడి కోసం బ్రహ్మానందం ఎందుకెళ్లారంటే..

ABN, First Publish Date - 2023-05-05T18:36:01+05:30

ఆయనను కొందరు ‘బ్రహ్మి’ అంటారు. మరికొందరు ‘హాస్య బ్రహ్మ’ అంటారు. మీమర్స్ అయితే ‘మా దేవుడు నువ్వేనయ్యా’ అని చేతులెత్తి మొక్కుతారు. ఎవరి గురించి ఇంతలా చెప్పుకుంటున్నామో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయనను కొందరు ‘బ్రహ్మి’ అంటారు. మరికొందరు ‘హాస్య బ్రహ్మ’ అంటారు. మీమర్స్ అయితే ‘మా దేవుడు నువ్వేనయ్యా’ అని చేతులెత్తి మొక్కుతారు. ఎవరి గురించి ఇంతలా చెప్పుకుంటున్నామో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు.. తన హావభావాలతోనే హాస్యాన్ని పుట్టించగల ఖాన్ దాదా బ్రహ్మానందం. దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల ముఖాల్లో చెరగని చిరునవ్వుకు కారణమైన ఈ ప్రముఖ హాస్య నటుడు తాజాగా ఓ వ్యక్తి కోసం కాళ్లకు బలపం కట్టుకుని మరీ సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కామెడీ చేసి జనాల్ని నవ్వించే బ్రహ్మానందం అంత సీరియస్‌గా ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆయన ఎన్నికల ప్రచారం చేస్తోంది కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ (Dr K Sudhakar) కోసం. కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర నియోజకవర్గం (Chikkaballapur) నుంచి గత ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి సుధాకర్ గెలుపొందారు. కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి సుధాకర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి మద్దతు తెలపని బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం కొసమెరుపు. అయితే.. సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేయడం ఇదేం తొలిసారి కాదు. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సుధాకర్‌కు మద్దతుగా బ్రహ్మానందం ప్రచారం చేశారు. దీంతో.. సుధాకర్‌కు, బ్రహ్మానందంకు మధ్య అంత సాన్నిహిత్యం ఏర్పడటానికి కారణం ఏంటనే ప్రశ్న అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే.. సుధాకర్‌‌ కొన్నేళ్ల నుంచి బ్రహ్మానందంతో సన్నిహితంగానే ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులతో కూడా ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. తారకరత్న అనారోగ్యంతో ఉన్న సమయంలో బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో తారకరత్నను చూసేందుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, తారక రత్నను దగ్గరుండి రిసీవ్ చేసుకుని ఆసుపత్రిలో ఉన్నంత సేపు వాళ్లతోనే సుధాకర్ ఉన్నారు. నందమూరి కుటుంబంతో కూడా సుధాకర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

చిక్‌బళ్లాపూర్‌లో బ్రహ్మానందంతో ప్రచారం చేయించడం వెనుక కారణం లేకపోలేదు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్‌లో తెలుగు ఓటర్లు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించే సంఖ్యలో ఉన్నారు. హిందూపురానికి, చిక్‌బళ్లపూర్‌కు మధ్య దూరం 80 కిలోమీటర్ల లోపే. హిందూపురం పరిధిలోని గొల్లపురం గ్రామానికి చిక్‌బళ్లాపురానికి మధ్య దూరం 50 కిలోమీటర్లు. సరిహద్దు ప్రాంతం కావడంతో చిక్‌బళ్లాపూర్ ప్రాంతానికి వెళ్లి చాలామంది తెలుగువాళ్లు కొన్నేళ్ల క్రితం స్థిరపడ్డారు. కన్నడ నాటే వారికి ఓటరు గుర్తింపు కార్డు వచ్చింది. దీంతో.. అక్కడి తెలుగు వాళ్లను ఆకర్షించడానికి ఉన్న ఏ అవకాశాన్ని సుధాకర్ వదులుకోదల్చుకోలేదు. బ్రహ్మానందాన్ని ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను కూడా సుధాకర్ ఆహ్వానించినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో ఉన్న జనసేన అభిమానులను సుధాకర్ స్వయంగా కలిశారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పొడవక ముందే జూనియర్‌ను పిలవడం సమంజసం కాదని ఈ బీజేపీ అభ్యర్థి లెక్కలేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కన్నడ సినీ నటుడు దర్శన్ కూడా సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. చిక్‌బళ్లాపూర్‌లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలే టార్గెట్‌గా బ్రహ్మానందంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్రహ్మానందం కూడా పూర్తిగా తెలుగులోనే ప్రచారం చేశారు. మైక్ అందుకుని తనదైన శైలిలో ‘ఖాన్ దాదాతో పెట్టుకుంటే శాల్తీలు లేచిపోతాయ్’ లాంటి డైలాగులతో నవ్వులపువ్వులు పూయించారు. తన గెలుపు కోసం ఇటు శాండల్‌వుడ్ స్టార్లను, టాలీవుడ్ నుంచి బ్రహ్మానందాన్ని సుధాకర్ రంగంలోకి దించారు.

ఒక్క చిక్‌బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి మాత్రమే కాదు ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా కర్ణాటకలో సినీ తారలతో ప్రచారం చేయిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్‌కు మద్దతుగా శివరాజ్‌కుమార్, దివ్య స్పందన వంటి సినీ తారలు ప్రచారం చేయగా, బీజేపీకి మద్దతుగా కిచ్చా సుదీప్, దర్శన్, ప్రేమ, సుమలత ప్రచారం చేయడం విశేషం. కేజీఎఫ్, కాంతారా, విక్రాంత్ రోణ సినిమాల తర్వాత శాండల్‌వుడ్ స్థాయి అమాంతం పెరిగింది. అక్కడి సినీ తారలకు కూడా క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో.. కర్ణాటక ఎన్నికల్లో సినీ తారల అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడటం విశేషం. గత ఎన్నికల్లో అంతగా సినీ తారల వైపు చూడని రాజకీయ నేతలు.. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం సినీ తారలను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తున్న పరిస్థితి. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-05-05T19:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising