ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Brain: బ్రెయిన్‌ స్ట్రోక్‌ జరిగితే మాత్రం..!

ABN, First Publish Date - 2023-11-01T14:16:22+05:30

గుండెకే కాదు మెదడు కూడా పోటుకు గురవుతుంది. రక్తనాళాలు చిట్లడం, రక్తస్రావం జరగడం వల్ల తలెత్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స అవసరం.

గుండెకే కాదు మెదడు కూడా పోటుకు గురవుతుంది. రక్తనాళాలు చిట్లడం, రక్తస్రావం జరగడం వల్ల తలెత్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స అవసరం. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించగలిగితే మరింత నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

మెదడుకు జరిగే రక్తస్రావం క్షీణించి, మెదడులోని రక్తనాళాలు డ్యామేజ్‌ అవడం వల్ల తెలెత్తే లక్షణాలే బ్రెయిన్‌ స్ట్రోక్‌. రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే ‘ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌’, రక్తనాళం చిట్లిపోతే ‘హెమరేజిక్‌ స్ట్రోక్‌’... ఇలా రెండు రకాల బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ ఉంటాయి. అయితే రెండు స్ట్రోక్స్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హెమరేజిక్‌ స్ట్రోక్‌లో మూర్ఛలు కూడా రావచ్చు. తలనొప్పి, వాంతులు కూడా ఉండవచ్చు.

లక్షణాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా అంగీకారం పొందిన బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు ‘ఆఉ ఊఅఖిఖీ’. అవేంటంటే....

బ్యాలన్స్‌: బ్యాలన్స్‌ తప్పడం. నడుస్తున్నప్పుడు తూలు రావడం, కళ్లు తిరగడం

ఐ: అకస్మాత్తుగా కంటి చూపు తగ్గడం, ఒక వైపు కనిపించకపోవడం

ఫేస్‌: ముఖంలో బలహీనత, మూతి వంకర పోవడం

ఆర్మ్‌ లేదా లెగ్‌: అకస్మాత్తుగా చేయి, కాలు లేపలేకపోవడం, లేదా స్పర్శ తగ్గిపోవడం

స్పీచ్‌: అకస్మాత్తుగా మాటలు ఆగిపోవడం లేదా మాట ముద్దగా రావడం

టైమ్‌: ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే ఆస్పత్రికి చేరుకోవడం ఈ లక్షణాలన్నీ అకస్మాత్తుగా తలెత్తడం బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రధాన లక్షణం.

ఎవరికి, ఎందుకు?

రెండు రకాల బ్రెయిన్‌ స్ట్రోక్స్‌కు వయసుతో సంబంధం లేదు. అయితే 50 ఏళ్లు పైబడిన వాళ్లలో మధుమేహం, అధిక రక్తపోటు సమస్యల ఉంటాయి కాబట్టి వాళ్లు బ్రెయున్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే పెద్ద వయసులో రక్తనాళాల పటుత్వం తగ్గడం, ధూమపానం, మద్యపానం అలవాట్ల తోడవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలుంటాయి. ఇక పిల్లల్లో సికిల్‌ సెల్‌ అనీమియా, పుట్టుకతో రక్తనాళాలు బలహీనండా ఉండడం వల్ల, తలకు దెబ్బలు తగలడం వల్ల అరుదుగా కొందరు పిల్లలు కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌, సెడెంటరీ లైఫ్‌ స్టైల్‌, వ్యక్తిగత, వృత్తిగత ఒత్తిడులు, ఒబేసిటీల కారణంగా, మధ్య వయస్కుల్లో (32 నుంచి 50) కూడా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ పెరుగుతున్నాయి.

సమయమే కీలకం

చికిత్స ఒక సెకను పాటు వృథా అయినా, మెదడులో 19 లక్షల న్యూరాన్లు డ్యామేజ్‌ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సమస్యను ఎంత త్వరగా నిర్థారించి, చికిత్స అందిస్తే, మరింత నష్టం జరగకుండా అక్కడితే నియంత్రించగలుగుతాం. ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌ విషయంలో తక్షణ చికిత్స ఎంతో కీలకం. లక్షణాలు తలెత్తిన నాలుగున్నర గంటల్లోగా బ్రెయిన్‌ స్కాన్‌ చేసి, రక్తపు గడ్డను గుర్తిస్తే, థ్రాంబోలైటిక్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి, అంతటితో నష్టానికి అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని రక్తనాళాల్లో ఏర్పడే రక్తపు గడ్డలను థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఆరు గంటల్లోపు తొలగించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 24 గంటల్లోగా చికిత్స అందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. అయితే ఈ చికిత్సలన్నీ స్ట్రోక్‌ వల్ల మెదడుకు జరిగిన నష్టాన్ని నివారించడానికి కాకుండా, మరింత నష్టం జరగకుండా నిలువరించడానికి మాత్రమే పనికొస్తాయి. థ్రోంబెక్టమీ చికిత్సలో గుండెకు యాంజియోగ్రామ్‌ చేసిన విఽధానాన్నే అనుసరిస్తారు. ఇక హెమరేజిక్‌ స్ట్రోక్‌కు ప్రధానంగా అధిక రక్తపోటే కారణమవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మెదడులో వాపు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, రక్తపోటును అదుపు చేయవలసి ఉంటుంది. అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ విషయంలో సమయం కీలకం. కాబట్టి ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన ఇంటర్వెన్షనల్‌ న్యూరాలజిస్ట్‌, క్యాథ్‌ ల్యాబ్‌ ఉన్న ఆస్పత్రిని ఎంచుకోవడం ఎంతో కీలకం.

తదనంతర చికిత్స ఇలా...

స్ట్రోక్‌ వచ్చిన కారణం మీద చికిత్స తదనంతర మందులు ఆధారపడి ఉంటాయి. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురైన వాళ్లు మరొక స్ట్రోక్‌ను నివారించడం కోసం జీవితాంతం మందులు వాడక తప్పదు. అయితే మందుల మోతాదును వైద్యులు క్రమేపీ మారుస్తూ ఉంటారు. ఈ మందులతో పాటు మధుమేహం, అధిక రక్తపోటులను కూడా అదుపులో ఉంచుకోవాలి. గుండె సమస్యలను అదుపులో ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం చేయాలి. పిండిపదార్థాలకు బదులుగా, పీచు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

మందులతో బలహీనత పోదు

సాధారణంగా మందులతో సమస్య సరిదిద్దుకోవచ్చు అనుకుంటారు. కానీ బ్రెయిన్‌ స్ట్రోక్‌లో ఇది అసాధ్యం. బ్రెయిన్‌ స్ట్రోక్‌ మూలంగా పక్షవాతం, మాటల్లో తేడా, అవయవాల్లో బలహీనతలు మందులతో మెరుగు పడవు. మందులతో రెండోసారి స్ట్రోక్‌ రాకుండా మాత్రమే నియంత్రించవచ్చు. అప్పటికే తలెత్తిన లక్షణాలను మెరుగు పరుచుకోవడం కోసం, ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీలను అనుసరించాలి.

స్కాన్‌లో మచ్చతో భయం వద్దు

సాధారణంగా సమస్య తలెత్తిన సమయంలో తీసిన బ్రెయిన్‌ స్కాన్‌లో మచ్చ కనిపిస్తుంది. అంటే అప్పటికే బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయిపోయింది. దీన్ని సరిదిద్దడం అసాధ్యం. కాబట్టి ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. అయితే చికిత్స తదనంతరం తీయించిన బ్రెయిన్‌ స్కాన్‌లో కూడా అదే మచ్చ మళ్లీ కనిపించడంతో, దాన్ని చూసి సమస్య అలాగే ఉండిపోయిందని భయపడుతూ ఉంటారు. కానీ శరీరం మీద గాయమైనప్పుడు, గాయం మానినా మచ్చ ఎలా మిగిలిపోతుందో, మెదడులో కూడా ఇలాగే మచ్చ ఏర్పడిపోతుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

నివారణ ఇలా....

90% బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ నివారించదగినవే! క్రమం తప్పకుండా రక్తపోటు, మధుమేహాలను పరీక్షించుకుంటూ, వాటిని మందులతో అదుపులో ఉంచుకోవడం, సమతులాహారం తీసుకోవడం, రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా బ్రెయిన్‌ స్ట్రోక్‌ను నివారించుకోవచ్చు.

అరుదైన ‘అన్యురిజమ్‌’

ఎలాంటి తలనొప్పి అయినా క్రమేపీ పెరుగుతుంది. కానీ అన్యురిజమ్‌లో తలనొప్పి పూర్తి భిన్నం. అకస్మాత్తుగా తట్టుకోలేనంత తలనొప్పి నిమిషం వ్యవధిలోనే వేధిస్తుంది. వీళ్లలో అసహజ రక్తనాళం చిట్లిపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల చిట్లేవి చిన్న రక్తనాళాలైతే, అన్యురిజం వల్ల పెద్ద రక్తనాళాలు చిట్లిపోతూ ఉంటాయి. దాంతో ఎక్కువ మొత్తాల్లో రక్తస్రావం జరగడం వల్ల, విపరీతమైన తలనొప్పి తలెత్తి, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, మూర్ఛలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సమస్యకు కారణమయిన రక్తనాళాన్ని బ్లాక్‌ చేయవలసి ఉంటుంది. దాంతో మెదడులో రక్తస్రావం తగ్గిపోతుంది. కొందర్లో వార్నింగ్‌ హెడ్‌ ఏక్‌ వస్తుంది. ఇది స్ట్రోక్‌కు ముందు దశ. ఈ దశలో తలనొప్పి విపరీతంగా వచ్చి, తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు అప్రమత్తమై ముందే వైద్యుల్ని కలిస్తే, అన్యూరిజమ్‌ను నివారించుకోవచ్చు. ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌కు ముందు కూడా కొందర్లో చేయి లేదా కాలు లేపలేకపోవడం లేదా స్పర్శ తగ్గడం, మూతి వంకరపోవడం లాంటి హెచ్చరిక లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ నొప్పితో సంబంధం లేని లక్షణాలు కాబట్టి వైద్యులను కలవడంలో అలక్ష్యం వహిస్తూ ఉంటారు. కానీ వెంటనే అప్రమత్తమై వైద్యులను కలిస్తే, మున్ముందు రాబోయే స్ట్రోక్‌ను నివారించుకోవచ్చు. ఇక అకస్మాత్తుగా అన్యురిజమ్‌కు గురైనప్పుడు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూరాలజి్‌స్టను కలవాలి. అయితే చికిత్స ఫలితం వేర్వేరు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రోగి ఆస్పత్రికి చేరుకున్న పరిస్థితి, రోగి కొమార్బిడ్‌ పరిస్థితి, గ్లాస్గో కోమా స్కేల్‌, మెదడులో జరిగిన రక్తస్రావం పరిమాణం, చిట్లిన రక్తనాళం.. ఇలా రోగి కోలుకునే స్థాయి ఈ అంశాలన్నిటి మీదా ఆధారపడి ఉంటుంది.

-డాక్టర్‌ పి. విక్రమ్‌ కిశోర్‌ రెడ్డి

కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-11-01T14:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising