Health: డాక్టర్లు ఆ ఫుడ్డే తినమని సూచిస్తున్నారు? తినొచ్చా?
ABN, First Publish Date - 2023-03-16T13:23:18+05:30
కండర నిర్మాణానికీ, రక్తవృద్ధికీ, కణాల నిర్మాణానికీ తోడ్పడే ప్రొటీన్ మాంసాహారంలోనే కాదు, శాకాహారంలోనూ సమృద్ధిగా దొరుకుతుంది. పరిపూర్ణమైన ఆరోగ్యానికి శరీర బరువులో కిలోకు
డాక్టర్, నేను శాకాహారిని. రక్తహీనత, బలహీనత వేధిస్తున్నాయి. వైద్యులు ప్రొటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారం తినాలని సూచించారు. ప్రొటీన్లు పుష్కలంగా దొరికే శాకాహారాన్ని సూచిస్తారా?
- ఓ సోదరి, హైదరాబాద్.
కండర నిర్మాణానికీ, రక్తవృద్ధికీ, కణాల నిర్మాణానికీ తోడ్పడే ప్రొటీన్ మాంసాహారంలోనే కాదు, శాకాహారంలోనూ సమృద్ధిగా దొరుకుతుంది. పరిపూర్ణమైన ఆరోగ్యానికి శరీర బరువులో కిలోకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. పప్పుధాన్యాల్లో ప్రొటీన్, పీచు ఎక్కువ. అలాగే చిక్కుడు కుటుంబానికి చెందిన బీన్స్, బఠాణీలు, కాయధాన్యాల్లో కూడా మాంసకృత్తులు అధికం. వంద గ్రాముల బీన్స్‌లో ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అంతే సమానమైన బఠాణీల్లో 8 గ్రా., పప్పు ధాన్యాల్లో 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
సోయా బీన్: జంతు మాంసకృత్తులతో సమానమైన పరిమాణంతో కూడిన మాంసకృత్తులు సోయాలో ఉంటాయి. రోజుకు 25 గ్రాముల సోయా తినడం ద్వారా ఈ పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. ఇందుకోసం గ్లాసుడు సోయా పాలు, ఒక కప్పు సోయా పెరుగు లేదా 80 గ్రాముల టోఫు తినవచ్చు.
క్వినోవా: దీన్ని అన్నంలా వండుకుని తినవచ్చు. ధాన్యాల్లో దొరకని అమీనో యాసిడ్లు క్వినోవాలో ఉంటాయి. అన్నం, చపాతీలకు ప్రత్యామ్నాయం. 200 గ్రాముల క్వినోవాలో 8 గ్రా. ప్రొటీన్ ఉంటుంది.
నట్స్: గుప్పెడు నట్స్ తింటే ప్రొటీన్‌తో పాటు, పీచు కూడా దక్కుతుంది. వీటిలో కొవ్వులు, క్యాలరీలు ఎక్కువే ఉన్నప్పటికీ, ఇవి గుండెకు మేలు చేసే అన్‌శాచురేటెడ్ కొవ్వులే! అయితే రోజుకు 30 గ్రాములకే పరిమితం కావాలి. 30 గ్రాముల వేరుసెనగపప్పులో 8 గ్రాముల ప్రొటీన్, అంతే సమాన పరిమాణంలోని వాల్‌నట్స్, హేజిల్‌నట్స్‌లో 4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
సీడ్స్: నట్స్‌లాగే సీడ్స్‌లో కూడా అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ప్రొటీన్ ఉంటాయి. సలాడ్స్‌తో వీటిని తినవచ్చు. లేదంటే నేరుగా స్నాక్‌గా వీటిని ఆస్వాదించవచ్చు. 30 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాల్లో 6 గ్రాముల ప్రొటీన్, గుమ్మడి విత్తనాల్లో 7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
పుట్టగొడుగులు: కప్పు పుట్టగొడుగుల్లో 0.8 గ్రా ప్రొటీన్ ఉంటుంది.
-డాక్టర్ సుమతి
డైటీషియన్, హైదరాబాద్.
Updated Date - 2023-03-16T14:24:03+05:30 IST