Monsoon: వర్షాకాలంలో గర్భిణిలు కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటే...!
ABN, First Publish Date - 2023-07-04T12:45:54+05:30
వర్షాకాలం ఆహ్లాదాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గర్భిణులకు ఈ కాలం కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. వానాకాలం పరిణామాలు గర్భిణుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఈ కాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ కాబట్టి గర్భిణులు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి.
వర్షాకాలం ఆహ్లాదాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గర్భిణులకు ఈ కాలం కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. వానాకాలం పరిణామాలు గర్భిణుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఈ కాలంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువ కాబట్టి గర్భిణులు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో గర్భిణులు సైతం వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు.
ద్రవపదార్థాలు పుష్కలంగా...
ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గినా హ్యుమిడిటీ తగ్గదు కాబట్టి, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్ మూలంగా తలనొప్పి, వికారం, మూర్ఛ మొదలైన సమస్యలు వేధిస్తాయి. కాబట్టి రోజు మొత్తంలో మరిగించి, చల్లార్చిన రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.
ఆహారం ఇలా...
గర్భిణుల్లో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. కాబట్టి ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి. వేడిగా ఉండే తాజా పదార్థాలనే ఎంచుకోవాలి. క్యాబేజీ, బచ్చలికూర లాంటి పురుగులు ఉండే వీలున్న కూరగాయలకు దూరంగా ఉండాలి.
స్ట్రీట్ ఫుడ్ వద్దు
బండ్ల మీద దొరికే అశుభ్రమైన వాతావరణంలో తయారయ్యే పదార్థాలకు దూరంగా ఉండాలి. అశుభ్రమైన పదార్థాలు సూక్ష్మక్రిములను ఆకర్షిస్తాయి. కాబట్టి వానా కాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే అలాంటి బయటి ఆహారాల జోలికి వెళ్లకూడదు.
వ్యక్తిగత పరిశుభ్రత
గర్భిణుల రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వంటకు ముందు, భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్‌ను కూడా ఉపయోగిస్తూ ఉండాలి. రోజుకు ఒకసారి యాంటిసెప్టిక్ కలిపిన నీటితో స్నానం చేయడం అవసరం. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
దుస్తులు ఇలా...
ఈ కాలంలో సౌకర్యవంతమైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వదులైన దుస్తులతో చమట పట్టకుండా ఉంటుంది. తేమ చోటు చేసుకోకుండా ఉంటుంది. తేమతో చర్మం మీద దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సింథటిక్ దుస్తులకు బదులుగా వదులుగా ఉండే కాటన్ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
పరిసరాల శుభ్రత
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పరుపులు దులుపుతూ ఉండాలి. దిండ్ల కవర్లు, దుప్పట్లు తరచూ మారుస్తూ ఉండాలి. టాయిలెట్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
దోమలు కుట్టకుండా...
దోమ తెరలు వాడుకోవాలి. మస్క్యుటో రిపెల్లెంట్స్ వాడుకోవాలి. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
-డాక్టర్ స్వాతి గోగినేని
అబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్,
అపోలో క్రేడిల్ అండ్
చిల్డ్రన్స్ హాస్పిటల్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.
Updated Date - 2023-07-04T12:45:54+05:30 IST