Winter Food: శీతాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
ABN, First Publish Date - 2023-11-25T11:31:58+05:30
కాలాల ఆధారంగా ఆహారం.. ఆరోగ్యం ఉండటం కోసం మన పూర్వీకులు చెప్పిన సిద్ధాంతం. దీని వెనకున్న కారణాలేమిటో చూద్దాం..
కాలాల ఆధారంగా ఆహారం.. ఆరోగ్యం ఉండటం కోసం మన పూర్వీకులు చెప్పిన సిద్ధాంతం. దీని వెనకున్న కారణాలేమిటో చూద్దాం..
మన శరీరానికి శక్తిని ఇచ్చే విషయంలో వేసవికాలం, శీతాకాలం- ఆదాన ప్రదానాలుగా పనిచేస్తాయి. ఆదానం అంటే తీసుకునేది. ప్రదానము అంటే ఇచ్చేది. శరీరానికి శక్తినిచ్చేది శీతాకాలం. శక్తిని లాక్కునేది వేసవి కాలం. దీనినే ఋతుచర్య అంటారు. దీనికి తగ్గట్టుగా ఆహార విహారాలను మార్పు చేసుకోవాలి. శీతాకాలం శక్తిని ఇచ్చే కాలం కాబట్టి శరీరంలో శక్తులు వృద్ధి చెందుతాయి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం కార్తీకమాసం గురించి చెప్పుకోవాలి. ఈ మాసం వేసవికి శీతాకాలానికి మధ్య సంధి లాంటిది. ఈ మాసంలో కూరగాయలకు కరువొస్తుంది. ఆహార పొదుపు అవసరం అవుతుంది. అందుకే ఉపవాసాలు, వన సమారాధనలు ఈ మాసంలో ఎక్కువగా జరుగుతాయి. మార్గశిరం అంటే డిసెంబరు మొదటి వారం నుంచి శీతాకాల ప్రభావం మనపై ఎక్కువగా కనిపిస్తుంది. శీతాకాలంలో హేమంత, శిశిర రుతువులు వస్తాయి.
ఈ సమయంలో ఏం చేయాలంటే..
వేసవి కారణంగా వృద్ధి చెందిన పిత్తదోషం హేమంత ఋతువులో ఉపశమనం పొందుతూ వస్తుంది. కానీ శిశిర ఋతువులో క్రమేణా కఫ దోషం పెరుగుతుంది. అందుకే శీతాకాలంలో అతి చల్లని పదార్థాలు తినకూడదు. రక్తాది ధాతువులు ప్రవహించే మార్గాల్లో కఫం అవరోధం కలిగిస్తుంది. చెమటను బయటకు పంపే స్వేద గ్రంధులు ఈ కాలంలో పూడుకుపోతాయి. అందువల్ల శరీర ఉష్ణం బయటకు పోదు. జఠరాగ్ని ఎక్కువగా ఉంటుంది. ఏది తిన్నా త్వరగా అరిగిపోతుంది.
ఈ కాలంలో వాతదోషం వికటిస్తుంది. కీళ్లవాతం, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చెడ్డకాలం. అందువల్ల వాతం ఎక్కువ కాకుండా సమతౌల్య పౌష్టికాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. నెయ్యి, నూనెలతో వండినవి.. పులుపు, ఉప్పు కొద్దిగా ఎక్కువగా ఉన్నవి తినటం మంచిది.. చెరుకురసం, ఆవనూనె వంటివి తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాకర వంటి చేదు పదార్థాలను తక్కువగా తినాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి.
శీతాకాలంలో ఎండ తీక్షణంగా ఉంటుంది. ఉదయాన్నే లేచి కొద్ది సేపు ఎండలో గడిపితే- విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. అంతే కాకుండా ఈ కాలంలో చిరుధాన్యాలను ఎక్కువగా తినటం మంచిది. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగినంతగా నిలుపుతాయి. ఎసిడిటీని తగ్గిస్తాయి. అందువల్ల రాగి, జొన్న, సజ్జ, ఆరికలు, సామల్లాంటివి తినటం ప్రారంభించేందుకు శీతాకాలాన్ని ఎంచుకోవచ్చు.
దుంపకూరల్లో కేరట్, ముల్లంగి, కంద, పెండలం, కర్రపెండలం వీటితో రకరకాలుగా కూరలు వండుకొని తినవచ్చు. ఆవపెట్టిన కంద బచ్చలి కూర శీతాకాలం కోసం కనిపెట్టిన వంటకం. ఆవపెరుగుపచ్చడిని శ్రీ కృష్ణదేవరాయలవారు
ఆముక్తమాల్యద దివ్యప్రబంధంలో ’ముక్కుమందు‘ అన్నారు. ఇది కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. వీలైనంత వరకూ కూరల్లో ఆవపిండి లేదా నువ్వు పిండిని కలుపుకొని తినటం మంచిది.
చేదు లేని కూరగాయలన్నీ శీతాకాలంలో తినటానికి అనువైనవే! శీతాకాలంలో జీర్ణశక్తి ఘనంగా ఉంటుంది కాబట్టి.. బూడిద గుమ్మడి, గుమ్మడి ఈ కాలానికి అనువైన కూరగాయలు. తోటకూర, మెంతికూరలను కూడా ఎక్కువగా వాడుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-25T11:39:25+05:30 IST