అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఏకంగా 16 మంది మృతి
ABN, First Publish Date - 2023-10-26T08:06:14+05:30
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మైనే, లెవిస్టన్‌లో జరిగిన సామూహికల కాల్పుల ఘటనలో కనీసం 16 మంది చనిపోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ ముష్కురుడు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని మైనే, లెవిస్టన్‌లో జరిగిన సామూహికల కాల్పుల ఘటనలో కనీసం 16 మంది చనిపోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తీవ్రవాది ఈ కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడు కాల్పులు జరిపిన స్థానంలో రైఫిల్ పట్టుకుని ఉన్న రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, అతను పరారీలో ఉన్నాడని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
కాగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు నిందితుడిని గుర్తించడానికి పోలీసులు స్థానిక ప్రజల సహాయాన్ని కోరారు. ఈ ఘటనపై లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. నిందితుడు పరారీలో ఉండడం, మళ్లీ కాల్పులకు పాల్పడే అవకాశాలు కూడా ఉండడంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైనే స్టేట్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో ఒక భాగమైన లెవిస్టన్.. మైనే అతిపెద్ద నగరమైన పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల (56 కి.మీ.) దూరంలో ఉంది.
Updated Date - 2023-10-26T08:13:49+05:30 IST