America Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న 150కి పైగా వాహనాలు.. ఏడుగురు మృతి
ABN, First Publish Date - 2023-10-24T17:56:22+05:30
అమెరికాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. లూసియానా రాష్ట్రంలో సోమవారం 150కి పైగా వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొట్టుకున్నాయి. దీంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..
అమెరికాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. లూసియానా రాష్ట్రంలో సోమవారం 150కి పైగా వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొట్టుకున్నాయి. దీంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం ఇంటర్‌స్టేట్-55 రహదారిపై జరిగింది. దట్టమైన పొగమంచు వల్ల ఎదురుగా ఏమున్నాయో వాహనదారులకు కనిపించలేదు. తద్వారా.. కార్లు, ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇలా 30 నిమిషాల పాటు వాహనాలు ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన 25 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్పల్ప గాయాలైన వాళ్లు తామే ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఢీకొన్న వాహనాల్లో ఇంధనంతో నిండిన ట్యాంకర్ కూడా ఉంది. అదృష్టవశాత్తూ అది ఈ ప్రమాదంలో పేలలేదు. ఒకవేళ పేలి ఉంటే మాత్రం.. ప్రమాద తీవ్రత మరింత ఉండేదని, మరణాల సంఖ్య కూడా పెరిగేదని అధికారులు వెల్లడించారు. ట్యాంకర్‌ని తొలగించాక.. సహాయక సిబ్బంది చిక్కుకున్న వారిని కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్టు తేలిందని, ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.
ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచు కారణమే అయినా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం తాము రాష్ట్ర రవాణ శాఖతో సమన్వయం చేసుకుంటామన్నారు. మరోవైపు.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు 11 మైళ్ల మేరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉన్న నేపథ్యంలో.. ఇంటర్‌స్టేట్-10 రహదారిని మూసివేయాలని అధికారులు యోచిస్తున్నారు. అటు.. న్యూ ఓర్లానో ప్రాంతంలో పొగ మంచు కారణంగా పాఠశాలల్ని రద్దు చేశారు. ఈ ఘటనపై నేషనల్ వెదర్ సర్వీస్ స్పందిస్తూ.. కార్చిచ్చుల పొగ సాధారణ పొగమంచుతో కలిసి పరిస్థితిని తీవ్రం చేస్తున్నాయని తెలిపింది.
ఈ ప్రమాదంపై లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు పొగ, దట్టమైన పొగమంచు కలయిక ఎంతో ప్రమాదకరమైనదని.. ప్రజాలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా.. ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తగా ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో.. సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని ప్రాణాలు కాపాడటంతో పాటు సహాయం అందించినందుకు గాను సహాయక బృందానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-10-24T17:56:22+05:30 IST