Twitter X Logo: X లోగో తెచ్చిన తంటా.. పాపం, కంటి మీద కునుకు లేకుండా చేసిందిగా!
ABN, First Publish Date - 2023-07-31T16:58:57+05:30
తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్‌లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌పై తన పైత్యం ప్రదర్శించడం..
తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్‌లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌పై తన పైత్యం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. బ్లూ టిక్ విషయంలో డబ్బులు వసూలు చేయడం దగ్గర నుంచి.. ‘టిక్’ రంగులు, ట్వీట్ల లిమిట్స్, ట్విటర్ పేరుని ‘X’గా మార్చడం, పిట్టని లేపేసి లోగోని ‘X’గా ఖరారు చేయడం.. వంటి ఎన్నో మార్పులు, చేర్పులు చేశాడు. అంతేకాదు.. ట్విటర్ హెడ్ క్వార్టర్స్ భవనంపై ‘X’ లోగో పెట్టి.. అది వెలుగులు జిమ్మేలా రేడియెంట్ లైట్ అమర్చాడు. ఇదే ఓ వ్యక్తి పాలిట శాపంగా మారింది. రాత్రైతే చాలు.. ఆ లోగో అతనికి చుక్కలు చూపిస్తూ, కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
అసలేమైందంటే.. ట్విటర్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్‌కి ఎదురుగా ఉండే ఒక భవనంలో క్రిస్టోఫర్ జే. బీలే అనే ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాత్రి సమయంలో ట్విటర్ X లోగోకు అమర్చిన లైట్లను వేస్తుండటం వల్ల.. ఆ వెలుగు అతని రూమ్‌లోకి దూసుకెళ్తోంది. ఆ వెలుగు దెబ్బకు అతని నిద్ర పాడవుతోంది. కనీసం క్షణం కూడా గ్యాప్ లేకుండా.. గడియగడియకు ఆ లైట్ వెలుగుతూ, ఎదురుగా ఉన్న భవనంపై ప్రతిబింబంగా పడుతోంది. సాధారణంగా.. మన ఇంట్లో లైట్ ఉంటేనే, ఆ వెలుగుకి మనకు నిద్ర పట్టదు. అలాంటిది.. డిస్కో డ్యాన్స్ చేసే రేడియెంట్ లైట్ నేరుగా బెడ్రూంలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు.. నిద్రెలా పడుతుంది చెప్పండి? ఈ బాధతోనే క్రిస్టోఫర్ తంటాలు పడుతున్నాడు. అందుకే.. తన బాధని ట్విటర్ మాధ్యమంగా పంచుకున్నాడు.
ఆ X లోగో ఎలా వెలుగుతున్నాయో, దాని ప్రభావం ఎంత మేర ఉందో ప్రజలకు తెలియజేస్తూ.. ట్విటర్ మాధ్యమంగా రెండు వీడియోలని షేర్ చేసుకున్నాడు. ఇది నా పరిస్థితి.. రాత్రయ్యే సరికి కళ్లు జిగేల్‌మనే లైటింగ్ నేరుగా నా బెడ్‌రూమ్‌లోకి వస్తోంది చూడండి’’ అంటూ ట్వీట్ చేశాడు.
Updated Date - 2023-07-31T16:58:57+05:30 IST