China Batwoman: కరోనాని మించిన మరో ప్రాణాంతకమైన వైరస్.. ప్రపంచానికి చైనా బ్యాట్‌ఉమన్ వార్నింగ్
ABN, First Publish Date - 2023-09-25T21:03:35+05:30
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలుసు. 2020-21 కాలంలో మొత్తం ప్రపంచం స్థంభించిపోయేలా చేసింది. లక్షలాది మంది ప్రాణాలను..
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలుసు. 2020-21 కాలంలో మొత్తం ప్రపంచం స్థంభించిపోయేలా చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసింది. ఇప్పుడు దీని ప్రభావం తగ్గినప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియెంట్లు మాత్రం అక్కడక్కడ భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు.. తాజాగా కరోనాని మించిన మరో ప్రాణాంతకమైన వైరస్ భవిష్యత్తులో రావొచ్చని ఓ ప్రముఖ సైంటిస్ట్ ప్రపంచవానికి హెచ్చరికలు జారీ చేసింది.
ఆ శాస్త్రవేత్త పేరు షీ జెంగ్లీ. చైనాకు చెందిన ఈ ప్రముఖ వైరాలజిస్ట్.. జంతువుల నుంచి వచ్చే వైరస్‌లపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఆమెకు బ్యాట్‌ఉమన్ అని కూడా పిలుస్తారు. కొవిడ్-19 మహమ్మారి నుంచి పాఠాలు తీసుకుంటూ.. అటువంటి వ్యాప్తిని ఎదుర్కోవటానికి ప్రపంచ సంసిద్ధతను ఆమె నొక్కి చెప్పారు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ అయిన షీ జెంగ్లీ.. గత 20 సంవత్సరాల నుంచి కరోనాపై అధ్యయనం చేస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. షీ జెంగ్లీ, ఆమె సహచరులు కలిసి 2023 జులైలో ఒక నివేదికను సిద్ధం చేశారు. ఇందులో.. 40 కరోనా వైరస్ జాతులలో సగానికి పైగా మానవ స్పిల్‌ఓవర్ ప్రమాదాన్ని అంచనా వేశారు. ఈ వైరస్ జాతులు చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నారు.
ఇప్పటికే ఆరు జాతులు మానవులకు సోకి, వారిని వివిధ వ్యాధుల బారిన పడేలా చేశాయని ఆ నివేదికలో షీ జెంగ్లీ పేర్కొన్నారు. మరో మూడు వైరస్‌లు ఇతర జంతు జాతులకు సోకినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఈ భయంకరమైన వ్యాధి బయటపడటం ఖాయమని, తద్వారా మరో కరోనా మహమ్మారి వచ్చే అవకాశం ఉందని షీ జెంగ్లీ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌ల హోస్ట్‌లను సైతం పరిశోధకులు గుర్తించారు. వీటిలో గబ్బిలాలు, వివిధ రకాల ఎలుకలు, సివెట్స్, పందులు, పాంగోలిన్‌లు ఉన్నాయి. ఈ హై-రిస్క్ వైరస్‌లపై నిఘా ఉంచేందుకు గాను.. పరిశోధకులు ఎంతో వేగవంతమైన, సున్నితమైన పరీక్షా సాధనాలను కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
కాగా.. షీ జెంగ్లీ జరిపిన ఈ అధ్యయనం.. జనాభా, జన్యు వైవిధ్యం, హోస్ట్ జాతులు. జూనోసిస్ చరిత్ర (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులు)తో పాటు వైరల్ లక్షణాల విశ్లేషణపై ఆధారపడింది. మరోవైపు.. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మరో పదేళ్ల పాటు నిధులు అందకుండా నిషేధించాలని యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ నిర్ణయం తీసుకోగా.. షీ జెంగ్లీ విడుదల చేసిన తాజా అధ్యయనం నివేదిక అందరి దృష్టిని ఆకర్షించింది.
Updated Date - 2023-09-25T21:03:35+05:30 IST