India vs Canada: భారత్ vs కెనడా.. ఆ దేశానికే తమ మద్దతు అంటూ అమెరికా అధికారి కుండబద్దలు
ABN, First Publish Date - 2023-09-23T17:57:28+05:30
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేసింది. ఈ వ్యవహారంలో...
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేసింది. ఈ వ్యవహారంలో ఇతర దేశాలు భారత్‌కే ఎక్కువగా తమ మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా సైతం భారత్‌కి మద్దతు ప్రకటిస్తూ.. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని ఇదివరకే తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సైతం ఇండియాకి సపోర్ట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ కంటే కెనడాకే పెద్ద ప్రమాదానికి దారితీశఆయని అన్నారు. భారత్ లేదా కెనడా దేశాల మధ్య ఏదైనా ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే.. భారత్‌కే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
వ్యూహాత్మకంగా కెనడా కంటే భారతదేశం చాలా ముఖ్యమైనదని.. భారత్‌తో సంబంధాలు తమకెంతో ఇంపార్టెంట్ అని రూబిన్ పేర్కొన్నారు. భారత్‌తో కెనడా పోరాటానికి దిగడమంటే.. ‘ఏనుగుపై చీమ పోరాడినట్లే’నని ఆయన వివరింరారు. భారత్‌పై ఆరోపణలు చేసి జస్టిన్ ట్రూడో చాలా పెద్ద తప్పు చేశాడని అభిప్రాయపడ్డారు. తన తప్పును సరిదిద్దుకోలేనంత స్థాయిలో ట్రూడో ఆరోపణలు చేశాడని.. ఆ ఆరోపణల్ని నిరూపించేందుకు కెనడా వద్ద ఆధారాలు కూడా లేవని అన్నారు. అసలు కెనడా ప్రభుత్వం ఒక ఉగ్రవాదికి ఎందుకు ఆశ్రయం ఇస్తోందో ట్రూడో వివరాలని డిమాండ్ చేశారు. తమకు భారత్, కెనడాలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. అవి రెండూ తమకు స్నేహితుల్లాంటివని.. అయితే ఈ రెండింటి మధ్య ఒకరిని ఎంపిక చేసుకోవలసి వస్తే తాము భారత్‌నే ఎంపిక చేసుకుంటామని చెప్పారు. ఎందుకంటే.. నిజ్జర్ ఉగ్రవాది కావడం, అలాగే భారత్‌తో సంబంధాలు ఎంతో ముఖ్యమని రూబిన్ వివరణ ఇచ్చారు.
జస్టిన్ ట్రూడో కెనడియన్ ప్రీమియర్‌షిప్‌కు ఎక్కువకాలం ఉండకపోవచ్చని.. అతడు వెళ్లిన తర్వాత తాము కెనడాతో సంబంధాలను పునర్నిర్మించుకోగలమని మైఖేల్ రూబిన్ పేర్కొన్నారు. హత్యకు గురైన నిజ్జర్ కేవలం సాధారణ ప్లంబర్ మాత్రమే కాదని.. ఒసాబా బిన్‌లాడెన్ కన్నా ఓ ‘కన్‌స్ట్రక్చర్ ఇంజినీర్’ అని అన్నారు. ఎన్నో దాడులకు పాల్పడిన నిజ్జర్ చేతులు రక్తంతో తడిచాయని పేర్కొన్నారు. మానవ హక్కుల కోసం ‘నిజ్జర్’ను ఉపయోగించడానికి అతడేమీ మోడల్ కాదని, ఎన్నో దాడుల్లో ప్రమేయం కలిగిన ఉగ్రవాది అని చెప్పారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడాకు వచ్చిన నిజ్జర్ గురించి మాట్లాడుకోవడానికి అతనేమీ మదర్ థెరిసా కాదని తేల్చారు. ట్రూడో మళ్లీ ఎన్నికల ప్రచారంలో పోరాడుతున్నాడు కాబట్టి, ఈ అంశాన్ని తన రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్నాడని అనిపిస్తోందన్నారు.
కాగా.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయడం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం, వెంటనే కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించడంతో.. భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. ట్రూడో ఆరోపణల్ని ఖండిస్తూ.. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కెనడా నుంచి వచ్చే వారికి వీసాల మంజూరు ప్రక్రియను సైతం భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇలా భారత్, కెనడా మధ్య వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తూనే ఉంది.
Updated Date - 2023-09-23T17:57:28+05:30 IST