Israel - Hamas: తమ చెరలోని మరో ఇద్దరు బందీలను విడుదల చేసిన హమాస్.. త్వరలోనే 50 మంది విడుదల?
ABN, First Publish Date - 2023-10-24T15:35:38+05:30
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది. వృద్దులైన ఆ ఇద్దరు మహిళలను గాజా, ఈజిప్టు మధ్య ఉన్న రఫా సరిహద్దు వద్ద విడిచిపెట్టారు. మానవతా కారణాల దృష్యా ఆ ఇద్దరు మహిళలను వదిలేసినట్లు హమాస్ సైన్యం తెలిపింది. ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో సదరు మహిళలను హమాస్ సైన్యం సోమవారం రాత్రి వదిలిపెట్టింది. కాగా ఇటీవల ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను హమాస్ విడిచినపెట్టిన సంగతి తెలిసిందే. మానవతా కోణంలో జుడిత్ తై రానన్, ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్‌ను విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే తాజాగా మరో ఇద్దరు మహిళలను కూడా విడుదల చేయడం గమనార్హం. దీంతో హమాస్ చెర నుంచి విడుదలైన బందీల సంఖ్య 4కు చేరుకుంది. అయితే త్వరలోనే హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో మరో 50 మందిని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ద్వంద్వ పౌరసత్వం కల్గి ఉన్న బందీలను విడిపించేందుకు రెడ్‌క్రాస్ ప్రతినిధులు గాజాకు వెళ్తున్నారని ఆ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంతమేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల సంఖ్యను ఆ దేశం మరోసారి సవరించింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇదే తుది సంఖ్య కాదని చెప్పడం గమనార్హం. దీనిని బట్టి భవిష్యత్‌లోనూ బందీల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు 75 ఏళ్ల దేశచరిత్రలో హమాస్ దాడిలో తమ దేశానికి చెందిన 1,400 మంది పౌరులు చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు గత 24 గంటల వ్యవధిలో హమాస్‌పై 300కు పైగా నూతన దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ సోమవారం వెల్లడించింది. దీంతో గాజాలో మరణాల సంఖ్య 5,000కు పెరిగింది అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మరణించిన వారిలో 2,000 మంది పిల్లలున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు తమ దేశం తరఫున పూర్తి సంఘీభావం తెలియజేయడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రోజు టెల్ అవీవ్ చేరుకున్నారు. కాగా ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 30 మంది ఫ్రెంచ్ పౌరులు మరణించారు.
Updated Date - 2023-10-24T15:35:38+05:30 IST