Imran Khan: నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు... ఇమ్రాన్ భార్య బుష్రా ఆందోళన
ABN, First Publish Date - 2023-08-19T17:07:39+05:30
తోషఖానా కేసులో అటక్ జైలులో ఉన్న తన భర్త, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, జైలులో ఆనయపై విష ప్రయోగం జరగవచ్చని ఆయన భార్య బుష్రా బీబీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంజాబ్ హోం శాఖ కార్యదర్శికి శనివారంనాడు ఆమె ఒక లేఖ రాశారు.
ఇస్లామాబాద్: తోషఖానా కేసులో అటక్ జైలులో ఉన్న తన భర్త, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రాణాలకు ప్రమాదం ఉందని, జైలులో ఆనయపై విష ప్రయోగం (Poioned) జరగవచ్చని ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన వసతులున్న జైలుకు ఆయనను తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ హోం శాఖ కార్యదర్శికి శనివారంనాడు ఆమె ఒక లేఖ రాశారు.
అటక్ జైలు నుంచి ఇమ్రాన్‌ను రావల్పిడిలోని అదియాలా జైలుకు తరలించాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు ఆ లేఖలో ఆమె తెలిపారు. ''అన్యాయంగా నా భార్తను జైలులో ఉంచారు. చట్ట ప్రకారం ఆయనను అదియాలా జైలుకు తరలించాలి. సామాజిక, రాజకీయ హోదాను బట్టి జైలులో బీ-క్లాస్ సౌకర్యాలు కల్పించాలి. గతంలో రెండుసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. దోషులను మాత్రం అరెస్టు చేయలేదు. ఇమ్రాన్ ప్రాణాలకు ఇప్పటికీ ముప్పు ఉంది. అటక్ జైలులో ఆయనపై విషప్రయోగం జరిగే అవకాశం ఉంది'' బుష్రా బీబీ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్టు జియా న్యూస్ తెలిపింది. ఇంట్లో వండి పంపిన ఆహారాన్ని ఇమ్రాన్ తీసుకునేందుకు అనుమతించాచాలని కూడా ఆ లేఖలో బుష్రా బీబీ కోరారు.
ఈ నెల మొదట్లో ఇమ్రాన్‌ను బుష్రా జైలులో అరగంట సేపు కలుసుకుంది. అననుకూల పరిస్థితిలో తనను ఉంచారని, సీ-క్లాస్ సౌకర్యాలు కల్పిస్తు్న్నారని ఇమ్రాన్ ఆమెతో వాపోయినట్టు తెలుస్తోంది. తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ విచారణ కోర్టు ఇటీవల ఇమ్రాన్‌ను దోషిగా ప్రకటించడంతో లాహోర్ హౌస్ నుంచి ఆయనను వెంటనే అరెస్టు చేశారు. 2018-2022 మధ్యలో ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను ఆయన చట్టవిరుద్ధంగా అమ్మి వాటిని దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనపై ఐదేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా వేటు పడింది. అయితే, తాను ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని ఇమ్రాన్ చెబుతున్నారు.
Updated Date - 2023-08-19T17:12:00+05:30 IST