Imran Khan: లాయర్ హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఉపశమనం
ABN, First Publish Date - 2023-07-24T17:24:07+05:30
పాకిస్థాన్ లోని క్వెట్టాలో ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రజాక్ షార్ (అబ్దుల్ రజాక్ షార్) హత్య కేసులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించింది. ఆగస్టు 9వ తేదీ వరకూ ఆయనను అధికారులు అరెస్టు చేయరాదంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టాలో ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రజాక్ షార్ (అబ్దుల్ రజాక్ షార్) హత్య కేసులో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఉపశమనం లభించింది. ఆగస్టు 9వ తేదీ వరకూ ఆయనను అధికారులు అరెస్టు చేయరాదంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ కోసం ఇమ్రాన్ ఖాన్ సోమవారంనాడు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. జస్టిస్ యాహ్యా అఫ్రిది సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసు విచారణ చేపట్టింది.
సీనియర్ లాయర్ అబ్దుల్ రజాక్ జూన్ 6వ తేదీన హత్యకు గురయ్యారు. బెలూచిస్థాన్ హైకోర్టుకు ఆయన వెళ్తుండగా క్వెట్రాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. అబ్దుల్ రజాన్ తనయుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ మరుసటి రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. హత్యానేరంపై అటు ప్రభుత్వం, ఇటు పీటీఐ పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. రాజద్రోహం కేసు నుంచి తప్పించుకునేందుకు ఖాన్ తరఫున అబ్దుల్ రజాక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అతావుల్లా తరార్ ఆరోపించారు. ఇందుకు ప్రతిగా ప్రధాని, దేశీయాంగ మంత్రి రాణా సనావుల్లా ఈ హత్య వెనుక ఉన్నారని పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్ ఆరోపించారు.
ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) అరెస్టు వారెంటు జారీ చేయగా, దీనిని బలూచిస్తాన్ హైకోర్టు సమర్ధించింది. దీంతో ఈ కేసులో తన పేరు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, ఖాన్ ఏదైనా చెప్పదలిచినా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారంనాడు ఆయన తన లాయర్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. హత్య కేసుపై విచారణ జరుపుతున్న సంయుక్త విచారణ టీమ్ (జేఏటీ) ముందు పిటిషనర్ హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని బలూచిస్థాన్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టును ఈ సందర్భంగా కోరారు. దీనిపై తాము ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని బెంచ్ పేర్కొంటూ, పీటీఐ చీఫ్‌ను అరెస్టు చేయరాదంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది.
Updated Date - 2023-07-24T17:24:07+05:30 IST