Israel-Palestine War: అమెరికా క్యాపిటల్ భవనం వద్ద నిరసనలు.. 300 మంది అరెస్ట్
ABN, First Publish Date - 2023-10-19T09:43:36+05:30
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదంలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు బుధవారం అమెరికాలో నిరసనలు చేపట్టారు.
వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదంలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు బుధవారం అమెరికాలో నిరసనలు చేపట్టారు. నిరసనకారులంతా వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ భవనం లోపల ఉన్న కానన్ రోటుండాను చుట్టుముట్టారు. మొదట ర్యాలీగా వచ్చిన నిరసనకారులు క్యాపిటల్ భవనం లోపలికి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిరసనకారులంతా క్యాపిటల్ భవనం లోపల కూర్చొని చప్పట్లు కొడుతూ ఆందోళన తెలపడం వైరలైన వీడియోల్లో కనిపిస్తోంది. ఈ ఆందోళనలో వందలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో 300 మంది నిరసనకారులను పోలీసులను అరెస్ట్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. నిరనసనకారుల వల్ల ఏర్పడిన అంతరాయం కారణంగా క్యాపిటల్ భవనానికి భద్రతను కట్టుదిట్టం చేశారు.
బుధవారం ఒక్కసారిగా సమూహాలుగా వచ్చిన నిరసనకారులు గాజాలో వెంటనే కాల్పులను విరమించుకోవాలని నినాదాలు చేశారు. కాల్పుల విరమణ అని రాసి ఉన్న ప్లకార్టులను ప్రదర్శించారు. నిరసనలు వెల్లువెత్తడంతో క్యాపిటల్ నుంచి బయటికి రావడానికి ప్రధాన ద్వారానికి బదులుగా భూగర్భ సొరంగాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారని కాపిటల్ హిల్ సిబ్బంది వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. హౌస్ సార్జెంట్-ఎట్-ఆర్మ్స్ తదనంతరం కాంగ్రెస్ కార్యాలయాలకు మెమోను జారీ చేశారు. నిరసనలను దృష్టిలో ఉంచుకుని క్యాపిటల్ భవనానికి భద్రత కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి క్యాపిటల్ చుట్టూ బైక్-ర్యాక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. యూఎస్ క్యాపిటల్ పోలీస్ (USCP) కాంగ్రెస్ భవనాల లోపల నిరసనలకు అనుమతి లేదని పేర్కొంది. మధ్యాహ్నం నిరసనకారులందరినీ బయటికి పంపించేశారు. ఈ క్రమంలోనే అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 300 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-10-19T09:43:36+05:30 IST