Nawaz Sharif: జీ20 సదస్సుపై అతిపెద్ద జోకు వేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?
ABN, First Publish Date - 2023-09-13T18:45:40+05:30
భారతదేశం అంటే పాకిస్తాన్‌కి ఎందుకంత అసూయో తెలీదు కానీ.. భారత్ ఏదైతే విషయంలో సక్సెస్ సాధిస్తే చాలు, దాయాది దేశం ఒకవైపు పొగడ్తలు కురిపిస్తూనే మరోవైపు తన అక్కసు వెళ్లగక్కుతుంటుంది. ముఖ్యంగా..
భారతదేశం అంటే పాకిస్తాన్‌కి ఎందుకంత అసూయో తెలీదు కానీ.. భారత్ ఏదైతే విషయంలో సక్సెస్ సాధిస్తే చాలు, దాయాది దేశం ఒకవైపు పొగడ్తలు కురిపిస్తూనే మరోవైపు తన అక్కసు వెళ్లగక్కుతుంటుంది. ముఖ్యంగా.. పాక్ రాజకీయ నాయకులు భారత్ విజయాలపై విమర్శలు కురిపించడమే పనిగా పెట్టుకుంటుంటారు. లేకపోతే.. తాము భారత్ కంటే మరింత గొప్ప పనులు చేసేవాళ్లమంటూ డబ్బా కొట్టుకుంటారు. ఇప్పుడు పీఎమ్ఎన్-ఎల్ పార్టీ అధినేత, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా అలాంటి గొప్పలకే పోయారు. ఒకవేళ తన ప్రభుత్వం ఇంకా కొనసాగి ఉండుంటే.. జీ20 సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇచ్చినట్లే, పాక్‌లోనూ అలాంటి సమావేశాల్ని నిర్వహించేవాడినని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం లండన్‌లో ప్రవాసంలో గడుపుతున్న నవాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2017లో నన్ను అనర్హుడిగా ప్రకటించకుండా, నా ప్రభుత్వం ఇంకా కొనసాగి ఉంటే.. ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు మరో స్థాయిలో ఉండేది. జీ20లో పాకిస్తాన్‌కు స్థానం దక్కేది. భారత్ తరహాలోనే పాక్ కూడా జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేది’’ అని వెల్లడించారు. అయితే.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎంతో దయనీయంగా తయారైందని.. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల మధ్య ఆ దేశం కొట్టుమిట్టాడుతోందని.. సరైన తిండి లేక, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు విలవిల్లాడుతున్నారని.. ఇలాంటి స్థితిలో నవాజ్ షరీఫ్ జీ20పై చేసిన వ్యాఖ్యలు మరీ కామెడీగా ఉన్నాయంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలావుండగా.. వరుసగా మూడు సార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీష్ పేరు పనామా పేపర్స్ లీక్‌లో రావడంతో, సుప్రీంకోర్టు ఆయనపై వేటు వేసింది. జీవితకాల ప్రభుత్వ పదవి నిర్వహించడానికి అనర్హుడని కోర్టు 2018లో తీర్పునిచ్చింది. దీనికితోడు.. 2019లో అల్-అజీజియా అవినీతి కేసులోనూ ఆయన పాత్ర ఉందని తేలడంతో, నవాజ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆయన లాహోర్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన చికిత్స నిమిత్తం లండన్‌కు వెళ్లారు. ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికలతో పాలిటిక్స్‌లోకి పునరాగమనం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ పార్టీ విజయం సాధిస్తే.. తన అన్నయ్య నవాజ్ షరీఫ్ ప్రధాని బాధ్యతలు చేపడతారని ఇప్పటికే ఆయన సోదరుడు, పాక్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దేశాన్ని అణుసామర్థ్యం వైపు తీసుకెళ్లిన ఘనత నవాజ్‌దేనని, ఆయన పాకిస్తాన్‌కి వస్తే ఘనంగా స్వాగతిస్తామని కూడా తెలిపారు. మరోవైపు.. అక్టోబర్ 21వ తేదీన పాకిస్తాన్‌కు తిరిగి వచ్చేందుకు నవాజ్ షరీఫ్ సిద్ధమవుతున్నారు.
Updated Date - 2023-09-13T18:45:40+05:30 IST