Turkey: భారత బృందాల సేవలపై సర్వత్రా ప్రశంసలు
ABN, First Publish Date - 2023-02-19T22:46:36+05:30
తుర్కియే(Turkey), సిరియా( Syria)ల్లో భూకంప (earthquake) వేళ భారత సహాయక బృందాలు అందించిన సేవలపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
అంకారా: తుర్కియే(Turkey), సిరియా( Syria)ల్లో భూకంప (earthquake) వేళ భారత సహాయక బృందాలు అందించిన సేవలపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ రెండు దేశాల్లో సేవలు ముగించుకుని భారత బృందాలన్నీ స్వదేశానికి తిరుగుముఖం పట్టాయి. ఈ సందర్భంగా అన్ని చోట్లా ప్రజలు భారత సహాయక బృందాలను చప్పట్లతో స్వాగతించారు. వరుసగా నిల్చుని చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరైతే భారత సహాయక బృందాల వారితో ఆటోగ్రాఫ్‌లు కూడా తీసుకున్నారు.
తుర్కియే, సిరియాల్లో రెండు వారాల క్రితం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి లక్షల ఇళ్లు, భవనాలు నేల కూలాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని 46 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.
భూకంపం సంభవించిన వెంటనే ఆపరేషన్ దోస్త్ (Operation Dost) పేరిట భారత ప్రభుత్వం సహాయక బృందాలతో పాటు సహాయక సామాగ్రిని, ఔషదాలను పంపింది. డాగ్ స్క్వాడ్‌లను కూడా పంపించింది. నుర్‌దాగీ, అంటక్యా ప్రాంతాల్లో 12 రోజుల పాటు భారత సహాయక బృందాలు సేవలందించాయి. ఎన్డీఆర్ఎఫ్‌తో (NDRF personnel) పాటు భారత సైన్యం (Indian Army Medical Facility) కూడా వైద్య సేవల్లో పాలుపంచుకుంది. గాయపడ్డవారికి సైనిక డాక్టర్లు, నర్సులు సేవలందించారు. అనేకమంది ప్రాణాలు కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే రేయింబవళ్లూ శిథిలాలను తొలగిస్తూ అనేకమందిని కాపాడారు. తుర్కియే, సిరియా దేశాల సిబ్బందితో పాటు స్థానికుల సహకారం కూడా తీసుకుని అనేక మంది ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. భారత సహాయక బృందాల సేవలను ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు మెచ్చుకున్నాయి.
కష్టకాలంలో సత్వరమే స్పందించి సహాయక బృందాలను పంపినందుకు తుర్కియే, సిరియా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. భూకంపవేళ రావాలనుకున్న పాక్ (Pakistan) ప్రధానిని తుర్కియే వద్దంది.
Updated Date - 2023-02-19T22:50:23+05:30 IST