Kim Jong Un: పుతిన్‌తో సమావేశానికి రష్యా వెళ్లిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. అమెరికా వద్దన్నా వినకుండా ఎందుకెళ్లారంటే..?
ABN, First Publish Date - 2023-09-12T11:37:57+05:30
క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) తాజాగా మరో సంచలనానికి తెరదీశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు రష్యా వెళ్లారు. రైలు ప్రయాణం ద్వారా రష్యాలోకి ప్రవేశించారని రష్యా అధికార మీడియా సంస్థ రియా నొవొస్తీ మంగళవారం వెల్లడించారు.
సియోల్: క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) తాజాగా మరో సంచలనానికి తెరదీశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు రష్యా వెళ్లారు. రైలు ప్రయాణం ద్వారా రష్యాలోకి ప్రవేశించారని రష్యా అధికార మీడియా సంస్థ రియా నొవొస్తీ మంగళవారం వెల్లడించారు. ఉత్తరకొరియా నుంచి రష్యాలోని ప్రిమోర్స్కీ ప్రాంతంలోకి రైలు ప్రవేశించిందని తెలిపింది. డార్క్ గ్రీన్ బోగీలతో కూడిన రైలును రష్యన్ రైల్వే లోకోమోటివ్ నడిపించినట్టు విడుదలైన ఫొటలోను బట్టి స్పష్టమవుతోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కిమ్ జాంగ్ ఉన్ ఈ వారంలోనే కలవనున్నారని రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఆయుధాలకు సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ఆర్టిలరీ షెల్స్, యాంటీట్యాంక్ మిసైల్స్ అందించాలని ఉత్తరకొరియాను రష్యా కోరబోతోందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రతిగా అత్యాధునిక శాటిలైట్, న్యూక్లియర్ సామర్థ్యమున్న సబ్‌మెరైన్ టెక్నాలజీని ఉత్తరకొరియాకు అందించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కిమ్ రష్యా వెళ్లిన విషయాన్ని దక్షిణకొరియా కూడా నిర్ధారించింది. మంగళవారం రష్యాలోకి కిమ్ రైలు ప్రవేశించిందని తెలిపింది. కాగా నాలుగేళ్ల తర్వాత కిమ్‌కు ఇది మొట్టమొదటి విదేశీ ప్రయాణం కావడం గమనార్హం. అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం వార్షిక ఎకనామిక్ ఫోరం కోసం వ్లాదివొస్టోక్‌లో ఉన్నారని రష్యా మీడియా చెబుతోంది. ఇరుదేశాల అధ్యక్షులు చాలా సున్నితమైన, కీలకమైన అంశాలపై చర్చించబోతున్నారని రష్యా అధికార ప్రతినిధి దిట్రీ పెస్కోవ్ తెలిపారు. ఒక పొరుగుదేశంతో సున్నిత ప్రాంతాల్లో కచ్చితంగా సహకారం ఉంటుందన్నారు. సున్నిత విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరముండదన్నారు. పొరుగుదేశాల ప్రభుత్వాలతో ఇలాంటి సహకారం సహజమేనని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయుధాల సరఫరా విషయంలో రష్యాకు సహకరించొద్దని ఉత్తరకొరియాను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఆయుధాలు సప్లై చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కిమ్ జాంగ్ ఉన్‌ను బెదిరించింది. అయినప్పటికీ కిమ్ రష్యా వెళ్లడం గమనార్హం.
Updated Date - 2023-09-12T11:40:47+05:30 IST