Luna-25 Crash: లూనా-25 కూలడానికి అసలు కారణమిదే.. రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
ABN, First Publish Date - 2023-08-22T14:46:02+05:30
దాదాపు 50 సంవత్సరాల తర్వాత రష్యా చేపట్టిన తొలి మూన్ మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే. రష్యా స్పేస్ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై చేరగానే అది కుప్పకూలింది. ఇలా కూలిపోవడానికి గల కారణాలేంటో...
దాదాపు 50 సంవత్సరాల తర్వాత రష్యా చేపట్టిన తొలి మూన్ మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే. రష్యా స్పేస్ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై చేరగానే అది కుప్పకూలింది. ఇలా కూలిపోవడానికి గల కారణాలేంటో రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ తాజాగా వెల్లడించింది. నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్‌లోని ఇంజిన్లు ఆఫ్ కాలేదని, దాంతో లూనా-25 అనుకున్న కక్ష్యను దాటి మరో కక్ష్యలోకి వెళ్లిందని ఆ ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్ తెలిపారు. సరైన సమయానికి ఇంజిన్లు ఆఫ్ కాకపోవడం వల్ల అది కుప్పకూలిందని చెప్పారు.
తాము అనుకున్నట్టు ఇంజిన్ 84 సెక్లనలో ఆఫ్ కావాలని, కానీ ఆ ప్రక్రియ జరిగేందుకు 127 సెకన్లు పట్టిందని, ఫలితంగా చంద్రుని ఉపరితలంపై అది నియంత్రణ కోల్పోయి కూలిందని బోరిసోవ్ చెప్పారు. ఈ ప్రయోగం ఫెయిల్ అవ్వడానికి గల ఇతర కారణాలను తెలుసుకోవడం కోసం తాము మరింత లోతుగా విచారణ చేపట్టామని, ఇందుకోసం ఒక ప్రత్యేక కమీషన్‌ని ఏర్పాటు చేశామని బోరిస్ చెప్పారు. ప్రొపల్షన్ సిస్టమ్‌లో మిషన్ ఆపరేషన్ సరిగా జరగలేదని, లూనార్ ఆర్బిట్ నుంచి వ్యోమనౌక ముందుకు వెళ్లిందని చెప్పారు. ఈ మూన్ మిషన్ విఫలమైనప్పటికీ.. తమ స్పేస్ ఇంజినీర్లు విలువైన అనుభవాన్ని గ్రహించారని అన్నారు. ఈ మిషన్‌లో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుంటామన్న బోరిస్.. భవిష్యత్తులో లూనా-26, 27, 28 మిషన్లు తప్పకుండా సక్సెస్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. 1976లో చంద్రునిపై తన చివరి అంతరిక్ష నౌకను పంపిన రష్యా, దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మూన్ మిషన్‌ని చేపట్టింది. చంద్రుడి కక్ష్యలోకి నేరుగా అంతరిక్ష నౌకను పంపే శక్తిమంతమైన రాకెట్ ద్వారా లూనా-25 స్పెస్ మాడ్యూల్‌ని ఆగస్టు 10వ తేదీన లాంచ్ చేసింది. ఇది రోస్కోస్మోస్‌తో శనివారం మధ్యాహ్నం 2:57 గంటల వరకు కాంటాక్ట్‌లోనే ఉంది. కానీ.. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఇది కుప్పకూలింది. తమ మూన్ మిషన్ ఫెయిల్ అయ్యిందన్న విషయం తెలిసి.. రష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త (90) మిఖైల్ మారోవ్ ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన్ను ప్రస్తుతం క్రిమ్లిన్‌లో ఉన్న సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
Updated Date - 2023-08-22T14:46:02+05:30 IST