Russia Wagner: రష్యాలో వేగంగా మారుతున్న పరిస్థితులు.. మాస్కో దిశగా వాగ్నర్ తిరుగుబాటుదారులు...
ABN, First Publish Date - 2023-06-24T22:17:01+05:30
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్‌క్వాటర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
మాస్కో: ప్రిగోజిన్ నేతృత్వంలోని కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టమైంది. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్‌క్వాటర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారి దేశంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. 25 వేల మంది ఫైటర్లతో సరిహద్దులు దాటామని వాగ్నర్ గ్రూపు చెప్పడంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాగా కొన్ని ప్రాంతాల నుంచి జనాలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడిన ఓ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.
ఇంధన డిపోపై బాంబ్..
రష్యాలోని దక్షిణ నగరం వోరోజెన్‌లోని ఓ ఇంధన డిపోపై బాంబ్ దాడి జరిగింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అధికారులను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 30 ఫైరింజన్లతో 100 మంది ఫైర్‌ఫైటర్లు పోరాడుతున్నారని స్థానిక గవర్నర్ అలెగ్జాండర్ గుసేవ్ ప్రకటన చేశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో మిలిటరీ హెలికాప్టర్ కూడా తిరిగిందని సమాచారం. వాగ్నర్ గ్రూపు తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో యుద్ధానికి ఆర్మీ నాయకత్వం వహిస్తోందని చెప్పారు.
రష్యాకు షాకింగ్ పరిణామం..
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెన్సీ ప్రిగొజిన్ (Yevgeny Prigozhin) నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి లీకయిన ఆడియో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. ప్రిగొజిన్ ‘సాయుధ తిరుగుబాటుదారుడు’ అంటూ రష్యా అభివర్ణించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్.
కాగా వాగ్నర్ గ్రూప్ (అధికారికంగా పీఎంసీ వాగ్నర్) అనేది ఒక ప్రైవేటు మిలిటరీ ఆర్గనైజేషన్. దీనిని యెవ్జెన్సీ ప్రిగొజిన్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. ప్రిగొజిన్ ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి చెఫ్ (Cheff) గా పనిచేశారు. తన క్యాటరింగ్ బిజినెస్‌తో ప్రభుత్వ కార్యక్రమాల్లో క్యాటరింగ్ నిర్వహించేవాడు.
Updated Date - 2023-06-24T22:22:11+05:30 IST