India vs Canada: భారత్, కెనడా వివాదంలో దిమ్మతిరిగే ట్విస్ట్.. తెరవెనుక తతంగం నడిపింది అమెరికానే?
ABN, First Publish Date - 2023-09-24T19:20:04+05:30
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో.. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంలో సరికొత్త కోణం వెలుగు చూసింది. నిజ్జర్ హత్యకు...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో.. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంలో సరికొత్త కోణం వెలుగు చూసింది. నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ సమాచారం.. అమెరికా నుంచి కెనడాకు అందినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అమెరికా నుంచి తమకు ఈ ఇంటెలిజెన్స్ సమాచారం అందిన తర్వాత కెనడా ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేపట్టి, అదనపు సమాచారాన్ని సమకూర్చిందని ఆ పత్రిక పేర్కొంది. తన విచారణలో భాగంగా.. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి కెనడా చొరబడి కీలక సమాచారాన్ని సేకరించిందని, అదే ఇప్పుడు కచ్ఛితమైన ఆధారంగా మారిందని ఆ కథనం వెల్లడించింది. అందుకే జస్టిన్ ట్రూడో బహిరంగంగా భారత్‌పై అలాంటి తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. ఫైవ్ ఐస్ భాగస్వామ్యుల వద్ద నిజ్జర్ హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, అదే భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేసేందుకు ప్రేరేపించిందని.. ఓ ప్రముఖ యూఎస్ దౌత్యవేత్త ధృవీకరించినట్టు మరో మీడియా స్పష్టం చేసింది. అయితే.. ఈ అంశంపై మాట్లాడేందుకు వైట్‌హౌస్ అధికారులు సిద్ధంగా లేదు. ఎందుకంటే.. కెనడా, భారత్ రెండూ అమెరికాకు మిత్ర దేశాలు. ఈ రెండింటితో ఉన్న సంబంధాలకు అంతరాయం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. అమెరికా చాలావరకు మౌనంగా ఉంది. భారత్‌కు మద్దతు తెలుపుతున్నా.. ఈ వ్యవహారంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. అటు.. కెనడా ప్రభుత్వం, అధికారులు సైతం నిజ్జర్ హత్య కేసులో సేకరించిన సమాచారాన్ని విడుదల చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ సమాచారం బయటపెడితే.. ఇది ‘రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ సర్వీసు ఇన్వెస్టిగేషన్’ను దెబ్బతీస్తుందని వారు పేర్కొంటున్నారు.
ఇదిలావుండగా.. అమెరికా, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్స్ కలిసి ఫైవ్ ఐస్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఇది ఒక గూఢచార కూటమి. ఈ దేశాలన్నీ ఇంటెలిజెన్స్‌ను పంచుకుంటాయి. ఇది భారీ మొత్తం ఇంటర్‌సెప్టెడ్ కాల్స్, ఇతర మార్గాల్లో సేకరించిన సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే.. నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ను కెనడాకు అమెరికా అందజేసింది. అదే ఇప్పుడు భారత్, కెనడా మధ్య దౌత్య వివాదానికి దారి తీసింది. ఈ వివాదం ఎన్నాళ్లు కొనసాగుతుందో, దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో.. కాలమే సమాధానం చెప్పాలి.
Updated Date - 2023-09-24T20:04:37+05:30 IST