India-Canada Row: భారత్-కెనడా వివాదంలో ఊహించని ట్విస్ట్.. ప్లేటు తిప్పేసిన అమెరికా
ABN, First Publish Date - 2023-10-03T15:51:18+05:30
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో..
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో.. ఇరుదేశాల మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే.. ఇరుదేశాల మధ్య చెడిపోతున్న సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేవాలు ఓ కన్నేసి ఉంచుతున్నాయి. ముఖ్యంగా.. అమెరికా ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు తనవంతు కసరత్తులు చేస్తోంది. భారత్, కెనడా రెండూ అమెరికాకి ముఖ్యమే కాబట్టి.. ఆ రెండింటితో సంబంధాలు చెడకుండా, పక్కా ప్లానింగ్‌తో అమెరికా పావులు కదుపుతోంది.
అయితే.. కెనడా వాదనకు మాత్రం అమెరికా మద్దతు తెలుపుతూ వస్తోంది. నిజ్జర్ హత్య దర్యాప్తులో కెనడాకు సహకారం అందించాలంటూ భారత్‌ని కోరుతోంది. ఇప్పుడు మళ్లీ అదే స్టేట్‌మెంట్‌ని అమెరికా రిపీట్ చేసింది. కెనడా దర్యాప్తుకు భారత ప్రభుత్వం సహకరించాలని సూచించింది. ఇప్పటికే ఈ విషయమై బైడెన్ యంత్రాంగం ఢిల్లీ అధికారులతో కొన్నిసార్లు చర్చించిందని, ఈ వ్యవహారంలో కెనడాతో తాము సమన్వయం చేసుకుంటున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. భారత్, కెనడా దౌత్య ఉద్రిక్తతలపై ఓ పాక్ విలేకరి సంధించిన ప్రశ్నకు మాథ్యూ సమాధానం ఇస్తూ.. ‘‘ఈ విషయంపై మేము గతంలోనే మా వైఖరిని స్పష్టం చేశాం. ఈ వ్యవహారంపై కెనడాతో సమన్వయం చేసుకుంటున్నాం. నిజ్జర్ హత్యలో కెనడా చేపట్టిన దర్యాప్తుకు భారత ప్రభుత్వం సహకరించాలని ఇదివరకే మేము కొన్నిసార్లు సూచించాం. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ జరిపిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు’’ అని చెప్పుకొచ్చారు.
గతంలో తమ మద్దతు భారత్‌కే ఉంటుందని, ఎందుకంటే నిజ్జర్ ఓ ఉగ్రవాది అని చెప్పిన అమెరికా.. ఇప్పుడు మాత్రం కెనడా వాదనకు మద్దతిస్తూ ప్లేటు తిప్పేసింది. ఇదిలావుండగా.. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడంతో పాటు భారత దౌత్యాధికారిని బహిష్కరించడంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణల్ని భారత్ ఖండిస్తూ.. ఇక్కడున్న కెనడా దౌత్యాధికారిని బహిష్కరించి గట్టి కౌంటరే ఇచ్చింది. అంతేకాదు.. అక్టోబర్ 10లోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు అల్టిమేటం జారీ చేసింది కూడా! మరోవైపు.. నిజ్జర్ హత్య విషయంలో కెనడా చేసిన ఆరోపణలకు గాను ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలను అందించకపోవడం గమనార్హం.
Updated Date - 2023-10-03T15:59:37+05:30 IST