ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

France Violence : పోలీసులతో అల్లరి మూకల బాహాబాహీ.. దుకాణాల లూటీ.. 45 వేల మంది పోలీసుల మోహరింపు..

ABN, First Publish Date - 2023-07-01T12:38:40+05:30

ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో పదిహేడేళ్ల ఉత్తర ఆఫ్రికా మూలాలుగల బాలుడు మరణించడంతో ప్రారంభమైన హింసాకాండ నాలుగో రోజు కూడా కొనసాగింది. అల్లరి మూకలు రెచ్చిపోయి పోలీసులతో బాహాబాహీకి దిగారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, అనేక దుకాణాలను లూటీ చేశారు, ఓ ఆపిల్ రిటెయిల్ స్టోర్‌లో చొరబడి యథేచ్ఛగా దోచుకున్నారు. ఈ అశాంతి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్ : ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో పదిహేడేళ్ల ఉత్తర ఆఫ్రికా మూలాలుగల బాలుడు మరణించడంతో ప్రారంభమైన హింసాకాండ నాలుగో రోజు కూడా కొనసాగింది. అల్లరి మూకలు రెచ్చిపోయి పోలీసులతో బాహాబాహీకి దిగారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, అనేక దుకాణాలను లూటీ చేశారు, ఓ ఆపిల్ రిటెయిల్ స్టోర్‌లో చొరబడి యథేచ్ఛగా దోచుకున్నారు. ఈ అశాంతి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

పారిస్‌ శివారు ప్రాంతంలోని నంటెర్రే అనే పట్టణంలో నహేల్ ఎం అనే పదిహేడేళ్ల బాలుడు మంగళవారం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపినా ఆపకుండా కారులో దూసుకుపోవడంతో, ఆయనపై పోలీసులు కాల్పులు జరిపారు. తూటా ఆయన ఎడమ ఛాతీలోకి దూసుకెళ్లడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ బాలునిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై కేసు నమోదైంది. బాలుడిని ఆయన హత్య చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాస్కల్ ప్రచే మాట్లాడుతూ, బాలుడు కారును వేగంగా నడపడం వల్ల ఆయన కానీ, ఇతరులు కానీ గాయపడే అవకాశం ఉందనే ఆందోళనతోనే తాను కాల్పులు జరిపానని ఆ పోలీసు అధికారి చెప్పారని తెలిపారు. గతంలో కూడా ఈ బాలుడు ట్రాఫిక్ స్టాప్ ఆర్డర్స్‌ను అమలు చేసేవాడు కాదని, ఈ విషయాన్ని పోలీసులు అనేకసార్లు గుర్తించారని చెప్పారు.

వీడియో గేమ్‌ల ప్రభావం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ స్పందిస్తూ, అల్లరి మూకలు విధ్వంసం సృష్టించడానికి కారణం వీడియో గేమ్స్ అని ఆరోపించారు. అల్లర్లను నిరోధించడం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లల్లోనే ఉంచాలని కోరారు.

1,100 మంది అరెస్ట్

పదిహేడేళ్ల బాలుడి హత్యానంతరం పెల్లుబికిన నిరసన కార్యక్రమాల్లో హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డర్మనిన్ చెప్పారు. శుక్రవారం రాత్రి 270 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దీంతో మొత్తం మీద అరెస్టయినవారి సంఖ్య దాదాపు 1,100 దాటినట్లు తెలిపారు. అరెస్టయినవారి సగటు వయసు కేవలం 17 సంవత్సరాలని చెప్పారు.

అల్లర్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే..

స్ట్రాస్‌బర్గ్‌లో ఓ యాపిల్ స్టోర్‌లోకి అల్లరి మూకలు దూసుకెళ్లి, పెను విధ్వంసం సృష్టించాయి. కస్టమర్లను బెదిరించి, ఈ మాల్‌లోని వేర్వేరు చోట్ల దాక్కునేలా చేశారు. పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఈ యువతను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. స్ట్రాస్‌బర్గ్‌ ఒపేరా హౌస్‌ ఎంట్రన్స్ ధ్వంసమవడంతో శుక్రవారం ఈవెనింగ్ పెర్ఫార్మెన్స్‌ను రద్దు చేశారు.

మర్సీల్లెలో ..

ఫ్రాన్స్‌లో రెండో అతి పెద్ద నగరమైన మర్సీల్లెలో యువకులు ప్రొజెక్టైల్స్‌తో పోలీసులపై విరుచుకుపడ్డారు. దుకాణాలకు నిప్పుపెట్టి, దోచుకున్నారు. శుక్రవారం రాత్రి ఓ గన్ షాపును ధ్వంసం చేశారు. ఈ దుకాణంలోని తుపాకులను పట్టుకెళ్లిపోయారు. ఓ హంటింగ్ రైఫిల్‌ను తీసుకెళ్లిపోతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ నగరంలో 90 మందిని అరెస్ట్ చేశారు. విధులను ముగించుకుని ఇంటికెళ్తున్న ఇద్దరు పోలీసులపై 20 మంది నిరసనకారులు దాడి చేశారు. వీరిలో ఒకరిని కత్తితో పొడిచారు.

లయాన్‌లో ..

ఫ్రాన్స్‌లోని మూడో అతి పెద్ద నగరం లయాన్‌లో అల్లరి మూకలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. హింసాకాండను నియంత్రించేందుకు వచ్చిన పోలీసు అధికారులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిప్పు పెట్టారు. మోటారు సైకిల్ స్టోర్‌లోకి చొరబడి వాహనాలను దోచుకెళ్లారు.

ఫ్రాన్స్ శివారు ప్రాంతాల్లో కూడా ఈ నిరసనల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచ్ గుయానా దీవి రాజధాని కయెన్నేలో అల్లరి మూకలు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ తూటా 54 ఏళ్ల వయసుగల వ్యక్తికి తగలడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. హిందూ మహాసముద్రంలోని చిన్న దీవి రీయూనియన్‌లో నిరసనకారులు చెత్త తొట్టెలను తగులబెట్టారు. కార్లను ధ్వంసం చేశారు. భవనాలపై కూడా దాడి చేశారు.

అత్యవసర పరిస్థితి!

దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే అత్యవసర పరిస్థితిని విధించడం గురించి కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 2005లో జరిగిన ఆందోళనలు, నిరసనల తరహాలోనే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. అల్లర్లను అణచివేసేందుకు మొత్తం మీద 45 వేల మంది పోలీసులను మోహరించినట్లు తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయుధాలతో కూడిన వాహనాలను ఏర్పాటు చేశారు.

రాత్రి వేళల్లో బస్సులు, రైళ్లను రద్దు చేయాలని ఆదేశించినట్లు ఇంటీరియర్ మినిస్టర్ డర్మనిన్‌ తెలిపారు. బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ హుటాహుటిన అక్కడి నుంచి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి పారిస్ చేరుకున్న తర్వాత రెండుసార్లు మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. అల్లర్లు, విధ్వంసకాండకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని మెటా, ట్విటర్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించారు. హింసను ప్రేరేపిస్తున్నవారి వివరాలను వెల్లడించాలని కోరారు.

నాహెల్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు

నంటెర్రే మేయర్ పాట్రిక్ జర్రీ తెలిపిన వివరాల ప్రకారం, నాహెల్ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. ఈ బాలుడు అల్జీరియన్, మొరోకన్ మూలాలుగలవాడు. ఆయన తల్లి మౌనియా ఎం మాట్లాడుతూ, తన కుమారుడిని హత్య చేసిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు కోపం ఉందని చెప్పారు. యావత్తు పోలీసు వ్యవస్థపైనా తనకు కోపం లేదన్నారు. తన కుమారుడు అరబ్ వ్యక్తి మాదిరిగా కనిపించినందువల్లే అతనిని హత్య చేశారని ఆరోపించారు.

అమెరికా, బ్రిటన్ హెచ్చరిక

ఫ్రాన్స్‌లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆ దేశానికి వెళ్లేవారికి అమెరికా, బ్రిటన్ ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేశాయి. జూన్ 27 నుంచి జరుగుతున్న హింసాకాండను వివరిస్తూ, రోడ్డు మార్గంలో ప్రయాణించేవారికి ఇబ్బందులు తలెత్తవచ్చునని తెలిపాయి. మీడియాలో వార్తలను నిరంతరం గమనించాలని, అల్లర్లు జరిగే ప్రాంతాలకు వెళ్లవద్దని తెలిపాయి.

ఇవి కూడా చదవండి :

Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..

Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు

Updated Date - 2023-07-01T12:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising