Assam : బీజేపీ ఎంపీ నివాసంలో పదేళ్ల బాలుడి ఆత్మహత్య?
ABN, First Publish Date - 2023-08-27T11:56:44+05:30
అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్‌దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
న్యూఢిల్లీ : అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్‌దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలుని తల్లి ఆ ఎంపీ నివాసంలో పని చేస్తున్నారు.
అస్సాంలోని కచర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుబ్రత సేన్ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో శనివారం సాయంత్రం పదేళ్ల బాలుని మెడ చుట్టూ గుడ్డ కట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. ఆ బాలుని తల్లి, అక్క దీనిని గమనించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేసరికి ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా పరిశీలించినపుడు బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియో గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఫోన్‌ను ఇవ్వలేదని ఆ బాలుడు తన తల్లిపై కోపంగా ఉన్నాడని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. బాలుని తల్లి ఎంపీ నివాసంలో పని చేస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సిల్చార్ వైద్య కళాశాల, ఆసుపత్రి (SMCH)కి తరలించారు. ఆ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. దర్యాప్తునకు అందరూ సహకరిస్తున్నారని పోలీసులు తెలిపారు.
బాలుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఎంపీ రాయ్ ఇంట్లో పని చేస్తున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరణించిన బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. అతని అక్క ఎనిమిదో తరగతి చదువుతోంది. దాదాపు రెండున్నరేళ్లుగా వారు రాయ్ నివాసంలోనే మొదటి అంతస్థులో నివసిస్తున్నారు. వీరి స్వస్థలం కచర్ జిల్లా, పలోంగ్ ఘాట్ ప్రాంతం. పిల్లలకు మంచి చదువు చెప్పించడం కోసం ఆమె వారిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చారు.
బాలుడు మరణించిన విషయాన్ని పోలీసులు ఎంపీ రాయ్‌కి తెలియజేశారు. వెంటనే ఆయన బీజేపీ కార్యాలయం నుంచి తన నివాసానికి వచ్చారు. అనంతరం మీడియాతో రాయ్ మాట్లాడుతూ, బాలుడు మరణించి కనిపించిన గది తలుపులు లోపలి నుంచి మూసివేసి ఉన్నాయని తెలిపారు. పోలీసులు తలుపులను పగులగొట్టి చూసేసరికి ఆ బాలుడు స్పృహ కోల్పోయి కనిపించాడని చెప్పారు. ఆ బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అతనిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారని, అయితే అప్పటికే బాగా ఆలస్యమైందని, ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పారు. బాలుని తల్లి సరుకులు కొనడం కోసం బయటికి వెళ్లినపుడు ఈ దారుణం జరిగిందన్నారు. ఆమె బయటకు వెళ్లడానికి ముందు ఆ బాలుడు తనకు మొబైల్ ఫోన్ ఇవ్వాలని ఆమెను కోరాడని, అందుకు ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆమె తన కుమార్తెతో కలిసి సరుకులు కొనడానికి వెళ్లి, 40 నిమిషాల తర్వాత తిరిగి వచ్చారని, అప్పటికి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారని చెప్పారు. బాలుని మృతిపై అనుమానం ఉందని చెప్పారు. ప్రాథమికంగా చూసినపుడు ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, తనకు అనుమానం ఉందని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని, దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని కోరానని చెప్పారు. ఈ బాలుడు చాలా తెలివైనవాడని, మంచి నడవడిక కలవాడని చెప్పారు. ఆ బాలుని చేతి రాత తాను చూశానని, చాలా బాగుంటుందని తెలిపారు. చాలాసార్లు తాను అతనితో మాట్లాడానని చెప్పారు. ఆ బాలుని మరణం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టమని తెలిపారు. తన కుటుంబం దిగ్భ్రాంతికి గురైందన్నారు.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha elections : మా ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ : అశోక్ గెహ్లాట్
Britain : భారత్ ఎదుగుదలపై బ్రిటన్ దౌత్యవేత్త వ్యాఖ్యలు
Updated Date - 2023-08-27T11:56:44+05:30 IST