2K Note Withdrawl: రూ.2000 నోటు రద్దుకు కారణం ఏమిటి? పర్యవసానాలు ఏంటి?
ABN, First Publish Date - 2023-05-20T18:56:05+05:30
న్యూఢిల్లీ: సుమారు ఏడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ ముచ్చటపడి తీసుకువచ్చిన రూ.2,000 నోటు సైతం ఇప్పుడు 'ఔట్' అయింది. రూ.2,000 నోట్ల రద్దు ఈ ప్రభావం ఎవరిమీద ఉండబోతోంది? 2016లో మోదీ ప్రకటించిన నిర్ణయం అనంతరం ఎదురైన పరిణామాలు మళ్లీ పునరావృతం కానున్నాయా? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
న్యూఢిల్లీ: సుమారు ఏడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ (RBI) ముచ్చటపడి తీసుకువచ్చిన రూ.2,000 నోటు సైతం ఇప్పుడు 'ఔట్' అయింది. రెండు వేల నోట్ల సర్క్యులేషన్ వెంటనే ఆపేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఈనెల 19న ఆదేశించింది. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అర్బీఐ నిర్ణయంపై సహజంగానే విపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమైనప్పటికీ, రూ.2,000 నోట్ల రద్దు ఈ ప్రభావం ఎవరిమీద ఉండబోతోంది? 2016లో మోదీ ప్రకటించిన నిర్ణయం అనంతరం ఎదురైన పరిణామాలు మళ్లీ పునరావృతం కానున్నాయా? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
ఆర్బీఐ ఏం చెబుతోంది..?
మార్కెట్లో నోట్ల చెలామణిని దృష్టిలో ఉంచుకుని కొత్త నోట్లు తీసుకురావడం, ఉపసంహరించుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఆర్బీఐకి ఉంది.
అయితే 2016 నవంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్ద నోట్ల నిర్ణయం ప్రకటన ఆర్బీఐ నుంచి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట వెలువడింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆర్బీయే రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 2018లోనే ముద్రణకు కూడా నిలిపివేసినట్టు ప్రకటించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ వాటిని బ్యాంకుల్లోనూ, దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
నిజానికి, 2016లో రద్దు చేసిన రూ.5,00, రూ.1000 నోట్ల స్థానే రూ.2,000 నోటును అప్పట్లో ఆర్బీఐ తీసుకువచ్చింది. ఇంతలోనే మళ్లీ ఆ నోటును రద్దు చేయాలని ఆర్బీఐ ఎందుకు భావించినట్టు? మార్కెట్‌లో రూ.2,000 నోట్లు ప్రస్తుతం 10.08 శాతం మాత్రమే చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించిందని సమాచారం. ఆ ప్రకారం చూస్తే మిగతా 90 శాతం బ్లాక్ మనీగానే వెళ్లిపోయింది. బ్లాక్‌మనీని వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకుల అంచనాగా ఉంది. అయితే ఆర్బీఐ ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, వినియోగదారుల అవసరాలకు సరిపడా (చలామణికి సరిపడా) సొమ్ములు బ్యాంకుల్లో ఉన్నందున రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్న ప్రకటించింది.
సామాన్యుడిపై ప్రభావం ఎంత?
2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 రూపాయలు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించగానే అప్పట్లో జనంలో హాహాకారాలు చెలరేగాయి. సామాన్యుడి ఇబ్బడిముబ్బడిగా బాధలు పడ్డారు. రద్దయిన నోట్లు డిపాజిట్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి, క్యూలలో నిలబడి, సకాలంలో మార్చుకోలేక, అప్పులు దొరక్క, అధిక వడ్డీలతో అప్పులు తెచ్చుకుని అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కడగండ్ల బారిన పడి 108 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు అంచనాలు కూడా ఉన్నాయి. కానీ, కేంద్రం మాత్రం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పుకొచ్చింది. లెక్కకుమిక్కిలిగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను సమర్ధించింది. సుప్రీం ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న ఒక్కరే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే, నిర్ణయం అమలు జరిగిపోయిన దశలో తాము చేసేదేమీలేదని, సామాన్యుడికి ఉపశమనం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈసారి రూ.2,000 నోట్ల ఉపసంహరణపై స్వయంగా ప్రకటన చేసింది. మార్కెట్లోని నోట్లను వెనక్కి తీసుకోవాలని, కస్టమర్లకు వాటిని ఇవ్వవద్దని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.
ముందుగానే సిద్ధపడిన సామాన్యుడు?
రూ.2,000 నోట్ల రద్దు నిర్ణయం ఏదో ఒక రోజు ఆర్బీఐ నుంచి వెలువడుతుందనే విషయం సాధారణ ప్రజానీకం ముందుగానే గ్రహించి జాగ్రత్త పడినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీరిపై పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. రియల్ ఎస్టేట్ పైనే ఎక్కువగా ఈ ప్రభావం చూపుతుందని వారి అంచనాగా ఉంది. ఈ క్రమంలో మార్కెట్‌లో బ్లాక్‌మనీ రూపంలో ఉండిపోయిన 90 శాతం నోట్లు మళ్లీ బ్యాంకులకు చేరుతాయా? ఆర్బీఐ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇస్తుందా... అనేది వేచిచూడాలి.
Updated Date - 2023-05-20T18:56:05+05:30 IST