Heart attack : కాన్పూరులో బీభత్సం... ఐదు రోజుల్లో 98 మంది గుండెపోటుకు బలి...
ABN, First Publish Date - 2023-01-09T15:31:23+05:30
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో అనూహ్య సంఘటనలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది.
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో అనూహ్య సంఘటనలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు రోజుల్లో 98 మంది గుండెపోటు, మెదడు పోటు బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 44 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా, 54 మంది చికిత్సకు ముందే ప్రాణాలు విడిచారు. ఈ వివరాలను ఎల్‌పీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ (Laxmipat Singhania Institute of Cardiology) తెలిపింది.
ఒక వారంలో 723 మంది హృద్రోగులు ఈ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చారు. 14 మంది రోగులు గత శనివారం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు రోగులు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎనిమిది మంది ఆసుపత్రికి చేరుకునేలోగానే ప్రాణాలు కోల్పోయారు.
గడచిన 24 గంటల్లో 14 మంది రోగులు కాన్పూరులోని ఎస్‌పీఎస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాణాలు విడిచారు. హార్ట్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌లో 604 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొత్తగా చేరినవారు 54 మంది.
కార్డియాలజీ విభాగం సంచాలకులు వినయ్ కృష్ణ మాట్లాడుతూ, చలికాలంలో చలి నుంచి రోగులను కాపాడాలన్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు మాట్లాడుతూ, చలికాలంలో కేవలం వృద్ధులకు మాత్రమే గుండెపోటు వల్ల ప్రమాదం జరుగుతుందని అనుకోకూడదన్నారు. టీనేజర్లకు హార్ట్ అటాక్ వచ్చిన కేసులను కూడా తాము చూశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వెచ్చని ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నించాలన్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండటం మంచిదన్నారు.
Updated Date - 2023-01-09T15:31:29+05:30 IST