Uorfi Javed: వేషధారణపై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులకు నటి ఉర్ఫీ జావెద్ ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-01-13T19:54:37+05:30
తన వస్త్రధారణపై బీజేపీ నేత చిత్ర కిషోర్ వా (Chitra Kishor Wagh) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందీ బిగ్‌బాగ్ ఓటీటీ
Mumbai: తన వస్త్రధారణపై బీజేపీ నేత చిత్ర కిషోర్ వా (Chitra Kishor Wagh) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందీ బిగ్‌బాగ్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావెద్(Uorfi Javed) పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోడల్, నటి అయిన ఉర్ఫీకి హాని కలిగించేలా బీజేపీ నాయకురాలు చిత్ర కిషోర్ వా ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది నితిన్ సట్పుటే (Nitin Satpute) తెలిపారు.
ఈ నెల 4న చిత్ర కిషోర్ ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. ఉర్ఫీ వేషధారణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వేషధారణపై మహిళా కమిషన్ ఏమైనా చర్యలు తీసుకోగలదా? లేదా? అని ప్రశ్నించారు. అర్ధనగ్న మహిళ వీధుల్లో బహిరంగంగా తిరుగుతోందని, మహిళా కమిషన్ ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని చిత్ర ప్రశ్నించారు. తాము ఉర్ఫీకి వ్యతిరేకంగా నిరసన తెలపడం లేదని, అర్ధనగ్నంగా ఆమె అలా వీధుల్లో తిరుగుతున్నందుకేనని ఆమె పేర్కొన్నారు. మరి, మహిళా కమిషన్ ఈ విషయంలో ఏమైనా చేస్తుందా? లేదా? అని ప్రశ్నిస్తూ మరాఠీలో ట్వీట్ చేశారు.
చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, బహిరంగ ప్రదేశాల్లో ఇలా అర్ధ నగ్నంగా తిరగడం మహారాష్ట్ర సంస్కృతా? అని మరో ట్వీట్‌లో మండిపడ్డారు. ఉర్ఫీ సగం దుస్తులు ధరించి ఇలా ముంబై రోడ్లపై శరీరాన్ని ప్రదర్శించడాన్ని మహిళా కమిషన్ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు.
త్వరలోనే తాను మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు న్యాయవాది సట్పుటే తెలిపారు. బీజేపీ నేత ఇలా బహిరంగంగా ఉర్ఫీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, సామూహిక దాడి(Mob Lynching) ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఉర్ఫీకి రక్షణ కల్పించాలని ఉర్పీ న్యాయవాది కోరారు.
Updated Date - 2023-01-13T19:54:40+05:30 IST