Sumalatha: కర్ణాటక ఎన్నికల వేళ సుమలత కీలక నిర్ణయం!
ABN, First Publish Date - 2023-03-09T20:59:53+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ(BJP)కి ఇది బూస్ట్ ఇచ్చే వార్తే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జంపింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ(BJP)కి ఇది బూస్ట్ ఇచ్చే వార్తే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జంపింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. పార్టీలన్నీ నేతల చేరికలతో బిజీగా ఉన్న వేళ బీజేపీకి ఇది శుభవార్తే. ప్రముఖ నటి, మాండ్యా ఎంపీ సుమలత అంబరీష్(Sumalatha Ambareesh) బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Basavaraj Bommai) ఈ విషయమై మాట్లాడుతూ.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. సుమలత బీజేపీలో చేరబోతున్నారా? అన్న ప్రశ్నకు బొమ్మై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన సుమలత కాషాయ తీర్థం పుచ్చుకోవడం పక్కా అని, శుక్రవారం మాండ్యాలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారని సమాచారం. మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరెలో నిర్మించిన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ప్రారంభించనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడతారు. అలాగే, మాండ్యాలో 1.5 కిలోమీటర్ల పాటు జరిగే రోడ్డు షోలోనూ మోదీ పాల్గొంటారు.
ఈ ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) సుమలత మాండ్యా(Mandya) నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుమలత బీజేపీలో చేరికపై వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి యాదగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తాను నిర్ధారించలేనని, అలాగని తిరస్కరించలేనని అన్నారు. చాలా కాలం వేచి చూశారని, కాబట్టి మరో 24 గంటలు వేచి చూడాలని సూచించారు. కొంతమందికి కొంత సొంత బలం ఉంటుందని, వారు కనుక పార్టీలో చేరితే అది తప్పకుండా పార్టీకి బలం అవుతుందని అన్నారు.
59 ఏళ్ల సుమలత ఒకప్పుడు పాప్యులర్ నటి. దివంగత నటుడు, రాజకీయ నాయకుడు ఎంహెచ్ అంబరీష్ భార్య. 2019 ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభకు పోటీ చేసిన సుమలత అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిపై 1,25,876 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
Updated Date - 2023-03-09T21:06:02+05:30 IST