Manipur Violence: మణిపూర్‌లో మరో 6 నెలలు 'అఫ్‌స్పా' చట్టం పొడిగింపు
ABN, First Publish Date - 2023-09-27T17:35:29+05:30
తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ ను 'కల్లోలిత ప్రాంతం'గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.
ఇంఫాల్: తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ (Manipur)ను 'కల్లోలిత ప్రాంతం' (Distrubed area)గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో 6 నెలల పాటు పొడిగించింది. రాష్ట్రంలో 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్ప మిగతా అన్ని చోట్లా అక్టోబర్ 1 నుంచి ఇది అమలు చేయనున్నట్టు ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.
''పదే పదే హింసాత్మక ఘటనలకు కొంత మంది పాల్పడుతున్నందున రాష్ట్రం మొత్తాన్ని డిస్ట్రబ్డ్ ఏరియాగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆరు నెలల పాటు అఫ్‌స్పా కొనసాగుతుంది. గవర్నర్ దీనికి ఆమోదం తెలిపారు.'' అని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది. కాగా, కల్లోలిత ప్రాంతాల చట్టం పరిధిలోకి రాని 19 పోలీస్ స్టేషన్లలో ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్‌జామెయి, సేక్‌మాయీ, లాంసాంగ్, పస్టోల్, వాంగోయ్, పోరోంపట్, తౌబల్, బిష్ణుపర్, కాక్‌చిన్, జిర్బామ్ తదితర ప్రాంతాలున్నాయి.
కొద్దిరోజులుగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న తరుణంలో తప్పిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు తాజాగా వెలుగుచూడటం, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు గత మంగళవారం ఇంఫాల్‌లో నిరసనలకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో సుమారు 45 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థినులే ఉన్నారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించడంతో పాటు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి జరిపారు. దీంతో తిరిగి అక్టోబర్ 1 వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మెజారిటీ మెయితీ కమ్యూనిటీలు తమకు ఎస్‌టీ హోదా కల్పించాలని చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా గత మే 3న గిరిజన సంఘీభావం ప్రదర్శన జరిగింది. అనంతరం ఉధృతంగా చెలరేగిన హింసాత్మక ఘటనలలో మణిపూర్ అట్టుడికింది.
Updated Date - 2023-09-27T17:40:34+05:30 IST