Maha Cabintet Portfolios: ఢిల్లీ పెద్దలతో అజిత్ పవార్ అమీతుమీ..!
ABN, First Publish Date - 2023-07-12T21:16:36+05:30
మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తినకు తాకింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి మహారాష్ట్రలోని అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల చేరిన అజిత్ పవార్ బుధవారం రాత్రి హస్తినకు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి అజిత్ తీసుకువెళ్లనున్నారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తినకు తాకింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో తిరుగుబాటు బావుటా ఎగురవేసి మహారాష్ట్రలోని అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల చేరిన అజిత్ పవార్ (Ajit Pawar) బుధవారం రాత్రి హస్తినకు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి అజిత్ తీసుకువెళ్లనున్నారు. అజిత్ పవార్ వెంట ఎన్‌సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా ఢిల్లీ చేరుకున్నారు.
మడత పేచీ?
మహారాష్ట్ర కూటమి సర్కార్‌లో ఈనెల 2న చేరిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, 8 మంది ఎన్‌సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నించి శాఖలు కేటాయించడంలో జరుగుతున్న జాప్యంతో అజిత్ వర్గం గుర్రుగా ఉంది. అయితే, అజిత్ పవార్ కోరుతున్న కీలక శాఖల వ్యవహారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మింగుడు పడటం లేదని, ఈ కారణంగానే మంత్రివర్గం విస్తరణపై ఆయన తటపటాయిస్తున్నారని చెబుతున్నారు. దీనికితోడు కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం నుంచి కూడా మంత్రివర్గ విస్తరణపై ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు.
ఆ రెండు శాఖలు ఇవ్వాల్సిందే..!
అజిత్ పవార్ వర్గానికి ఇంధనం, రెవెన్యూ శాఖలను షిండే సారథ్యంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం ఇవ్వజూపింది. అయితే, తమకు హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు కావాలని అజిత్ వర్గం పట్టుబడుతోంది. ఆ రెండు శాఖలు ప్రస్తుతం బీజేపీ కీలకనేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతిలో ఉన్నాయి. ఆర్థిక శాఖ అజిత్ పవార్ చేతిలో పెడితే నిధులను ఎన్‌సీపీ నేతలకు అనుకూలంగా ఆయన కేటాయించే అవకాశాలు ఉంటాయని షిండే వర్గం అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు. దీనికితోడు, మంత్రివర్గ విస్తరణలో భాగంగా షిండే ప్రభుత్వం కొత్త ముఖాలకు చోటు కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు శివసేన, బీజేపీ మంత్రులకు ఉద్వాసన చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది షిండే శివసేన వర్గా్న్ని ఇరుకున పెట్టే వీలుంది. కొత్తగా చేరిన ఎన్‌సీపీ నేతలకు మంత్రి పదవులు కేటాయించి, శివసేనకు ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నాలు సరికాదని ఆ వర్గం నేతలు కొందరు లోపాయికారిగా చెబుతున్నారు. క్యాబినెట్ నుంచి శివసేన మంత్రులు ఒకరిద్దరిని తప్పిస్తే వారితో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందని, ఇందువల్ల పార్టీలో తిరుగుబాటుకు చేజేతులా అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సీఎం మదనపడుతున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అజిత్ తన మాట నెగ్గించుకుంటారా? కీలకమైన హోం, ఆర్థిక శాఖల కోసం ఆయన జరిపే ప్రయత్నాలకు బీజేపీ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా, మోకాలడ్డుతారా అనేది ప్రస్తుతం మహారాష్ట్ర రాజీకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Updated Date - 2023-07-12T21:16:36+05:30 IST