Passport: సారీ.. మీరు ఈ దేశ పౌరులు కాదు.. పొరపాటున పాస్‌పోర్ట్ ఇచ్చాం.. 61 ఏళ్ల తర్వాత ఆ డాక్టర్‌కు షాక్..!
ABN, First Publish Date - 2023-11-30T10:59:01+05:30
61 ఏళ్ల ఓ డాక్టర్‌కు అగ్రరాజ్యం అమెరికా బిగ్ షాకిచ్చింది. మీరు ఈ దేశ పౌరులు కాదంటూనే.. అతడి పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇక్కడే పుట్టి పెరిగినా, ట్యాక్సులు కూడా కట్టినా కూడా మీరు అమెరికన్ కాదంటూనే.. అందుకు ఓ వింత కారణాన్ని కూడా అమెరికా అధికారులు బయటపెట్టారు.
వాషింగ్టన్: ‘నేనొక డాక్టర్‌ను.. నా జీవితమంతా ఇక్కడే గడిపాను. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే టాక్సులు కూడా కడుతున్నాను. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరీ వైద్య సేవలను అందించాను. నా ప్రాణాలనే కాదు.. నా కుటంబ సభ్యుల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టి మరీ కొవిడ్ సమయంలో పనిచేశాను. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఎన్నో ఎన్నికల్లో ఓటు వేశాను. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఎన్నోసార్లు ఓటు హక్కును వినియోగించుకున్నాను.. 61 ఏళ్ల వయసులో.. రిటైర్ అవుదామనుకున్న సమయంలో సడన్‌గా వచ్చి మీరు ఈ దేశ పౌరులు కాదని అనడం ఎంత వరకు సమంజసం..’.. ఇదీ.. 61 ఏళ్ల ఓ డాక్టర్ ఆవేదన. పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. కొత్త పాస్‌పోర్టును జారీ చేయకపోగా.. అసలు మీరు ఈ దేశ పౌరులే కాదంటూ అమెరికా అధికారులు ఆయనకు ఊహించని షాకిచ్చారు.
శైవాష్ శోభానీ అనే 61 ఏళ్ల డాక్టర్ అమెరికాలోని నార్తెన్ వర్జీనియాలో నివసిస్తున్నారు. 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఆయన వైద్య సేవలను అందిస్తున్నారు. వయసు మీద పడుతూ ఉండటంతో ఇక వైద్య వృత్తికి విరామం చెప్పి.. శేష జీవితాన్ని హాయిగా కుటుంబంతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదే సమయంలో భార్యతో కలిపి విదేశీ టూర్లకు కూడా వెళ్లాలని పక్కాగా ప్లాన్లు గీసుకున్నారు. అయితే ఇందుకుగానూ తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేయాల్సి వచ్చింది. గతంలో ఎన్నోసార్లు ఆయన తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేయించుకున్నారు. ఆయన దరఖాస్తు చేసుకున్న ప్రతీసారి కొత్త పాస్‌పోర్ట్ ఆయన ఇంటికే పోస్ట్ రూపంలో వచ్చేది. అయితే ఈ సారి మాత్రం ఆయనకు అమెరికా అధికారులు కోలుకోలేని షాకిచ్చారు.
‘మీరు అమెరికా పౌరులు కాదు.. మీ పుట్టిన రోజు తేదీ ప్రకారం చూస్తే.. ఆ సమయంలో మీ తండ్రి గారు ఇరాన్ ఎంబసీలో దౌత్యవేత్తగా ఉన్నారు. అమెరికాలోనే మీరు పుట్టినప్పటికీ మీ తల్లిదండ్రులు మాత్రం డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ( అమెరికా చట్టాలు వర్తించని కేటగిరీ) పరిధిలో ఉన్నారు. 61 ఏళ్ల క్రితం అధికారులు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు ఇన్నాళ్లూ అమెరికా పౌరుడిగా జీవించారు. ఇన్నాళ్లకు జరిగిన తప్పును గుర్తించగలిగాము. మీ పాస్‌పోర్టును రద్దు చేస్తున్నాం.’ అంటూ అమెరికా అధికారులు శైవాష్ శోభానీకి లేఖను పంపించారు. దీంతో అవాక్కైన ఆ డాక్టర్.. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
ఈ వయసులో ఈ దేశం నన్ను పొమ్మంటోందీ అంటూ శైవాష్ శోభానీ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా పలు విషయాల్లో స్పందించిన తాను.. ఆ దేశ పౌరుడిని ఎలా అవుతానంటూ నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ అగ్రరాజ్య పౌరుడిగానే బతికిన తనను.. ఇప్పుడు అమెరికన్‌వు కావంటూ చెప్పడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించిన తననే.. ఈ దేశ పౌరుడిని కాదంటారా అని నిలదీస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ శాశ్వత రెసిడెన్సీ కోసం మరో దరఖాస్తు చేశాననీ.. లీగల్ ఫీజుల కింద 40 వేల డాలర్లు (33 లక్షల రూపాయలు) ఖర్చు కూడా చేశాననీ ఆయన వెల్లడించారు. కానీ ఈ లోపే తన పౌరసత్వం గురించి అధికారులు బాంబు పేల్చారని వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాననీ.. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందంటూ శైవాష్ శోభానీ తేల్చిచెబుతున్నారు.
Updated Date - 2023-11-30T11:03:45+05:30 IST