Modi : మోదీకి ప్రపంచంలో గొప్ప ప్రజాదరణ : అమెరికన్ నేత
ABN, First Publish Date - 2023-04-16T18:34:01+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రయ్‌మోండో
వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రయ్‌మోండో (US Commerce Secretary Gina Raimondo) ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన అద్భుతమైన, గొప్ప దార్శనికత కల నేత అని వ్యాఖ్యానించారు. ఆయన గొప్ప ప్రజాదరణ కల ప్రపంచ నేత అని తెలిపారు. భారత దేశాన్ని ప్రపంచ శక్తిగా అభివృద్ధి చేయాలనే బలమైన ఆకాంక్ష, చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనకు ఉన్నాయన్నారు. గత నెలలో భారత్‌లో మోదీతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ఎంబసీ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గినా రయ్‌మోండో మాట్లాడుతూ, మోదీతో గంటన్నరకుపైగా చర్చించే అద్భుత అవకాశం తనకు వచ్చిందని గినా రయ్‌మోండో చెప్పారు. ఆయన ఓ లక్ష్యం కోసం నిలిచిన అద్భుతమైన, గొప్ప ప్రజాదరణగల ప్రపంచ నేత అని చెప్పారు. ఆయన అద్భుతమైన నాయకుడని, గొప్ప దార్శనికతగలవారని చెప్పారు. భారత దేశ ప్రజల పట్ల ఆయనకుగల నిబద్ధత ఏ స్థాయిలో ఉందో వర్ణించడం సాధ్యం కాదన్నారు. ఆ చిత్తశుద్ధి, నిబద్ధత చాలా గాఢమైనవన్నారు. అవి నిజమైనవని, సాధికారమైనవని చెప్పారు. ప్రజలను పేదరికం నుంచి ఉద్ధరించాలని, ప్రపంచ శక్తిగా భారత దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆయనకుగల బలమైన ఆకాంక్ష చాలా వాస్తవమైనదని, ఆ ఆకాంక్ష నెరవేరుతోందని చెప్పారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నపుడు సభలో పాల్గొన్నవారంతా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.
మోదీ టెక్నాలజీని బాగా వాడతారనే సంగతి అందరికీ తెలిసిందేనని, ఆయన అత్యంత సూక్ష్మ వివరాలను కూడా తెలుసుకుంటారని చెప్పారు. అయితే తాను ఓ శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు ఆయనతో ఆయన నివాసంలో సమావేశమయ్యానని చెప్పారు. ఆ సమయంలో ఆయన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్స్, కృత్రిమ మేధాశక్తి గురించి మాట్లాడటం సంభ్రమాశ్చర్యాలు కలిగించిందన్నారు.
‘‘రాబోయే రోజుల్లో టెక్నాలజీకి సంబంధించిన రెండు ఎకో సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా ఉండేది, మరొకటి అలా లేనిది. ఈ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో ప్రపంచాన్ని భారత్, అమెరికాలు కలిసి నడపవలసిన అవసరం ఉందని నేను ఆయనకు చెప్పాను. ఆయన ఆ వారమంతా ప్రయాణాలు చేసి కూడా, కొంచెం కూడా తడుముకోకుండా, ‘ఔను, సెక్రటరీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అమెరికా-ఇండియా టెక్నాలజీ’ అని చెప్పారు’’ అని గినా తెలిపారు.
గినా గత నెలలో భారత దేశంలో పర్యటించారు. ఇండియా-యూఎస్ కమర్షియల్ డయలాగ్, ఇండియా-యూఎస్ సీఈఓ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Kejriwal Summons : ఇద్దరు ఆప్ నేతల అరెస్ట్
Karnataka : కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీకి ఊహించని షాక్..
Updated Date - 2023-04-16T18:34:01+05:30 IST