Amit Shah: కర్ణాటకలో ముస్లింలకు టికెట్లు ఎందుకీయలేదంటే?
ABN, First Publish Date - 2023-04-24T21:38:42+05:30
వరుసగా రెండోసారి ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై షా స్పందిస్తూ...
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో భాగంగా సక్లేశ్‌పూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా వరుసగా రెండోసారి ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై షా స్పందిస్తూ బీజేపీ మెజార్టీ, మైనార్టీ కోణంలో కాకుండా గెలుపుకోణంలో టికెట్లు ఇచ్చిందన్నారు. జగదీశ్ శెట్టర్‌ను గౌరవంగా చూసుకోనందుకే బీజేపీని వీడారన్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. జగదీశ్ శెట్టర్‌తో సహా ఏ నాయకుడినీ బీజేపీ అవమానించదని చెప్పారు. అంతేకాదు శెట్టర్ తలపడుతున్న హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ (Hubli Dharwad Central seat) నుంచి ప్రతిసారీ బీజేపీయే గెలిచిందని, ఇప్పుడు కూడా తామే గెలవబోతున్నామని చెప్పారు. శెట్టర్ శిష్యుడైన యువ నాయకుడు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్‌ని (Mahesh Tenginkai) బీజేపీ హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. ఇద్దరూ లింగాయత్ నేతలే కావడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి గత ఎన్నికల్లో శెట్టర్ గెలిచారు. ఈసారి మహేశ్ గెలుస్తాడని, శెట్టర్ ఓడిపోతారని షా జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందని షా చెప్పారు. అందుకే తాము ఆ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్‌సి, ఎస్టీ, లింగాయత్, ఒక్కలిగలకు న్యాయం చేశామన్నారు. కర్ణాటకను బీజేపీ మాత్రమే సురక్షితంగా ఉంచగలదని, పీఎఫ్‌ఐని అందుకే నిషేధించామని మిగతా పార్టీలు వారిని స్వేచ్ఛగా తిరగనిచ్చాయని షా ఆరోపించారు. కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకోవాలనుకుంటోందని, అధికారం కోసం జేడీఎస్ కాంగ్రెస్ పంచన చేరుతోందని షా ఆరోపించారు.
కర్ణాటకలో బొమ్మై సర్కారు 40 శాతం కమిషన్ సర్కార్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని షా తిప్పికొట్టారు. అవినీతిపై నిరాధార ఆరోపణలు చేసేకంటే ఆధారాలతో కోర్టులను ఆశ్రయించవచ్చని షా సూచించారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలను తప్ప రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై షా స్పందించారు. 56 లక్షల మంది రైతులకు ఏడాదికి పదివేల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకి పంపుతున్నామని షా చెప్పారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Updated Date - 2023-04-24T22:05:38+05:30 IST