Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న
ABN, First Publish Date - 2023-09-11T21:37:00+05:30
ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..
ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. కాంగ్రెస్, శివసేన అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేలను టార్గెట్ చేశారు. తాను భగవద్గీత చదివానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే.. సనాతన ధర్మాన్ని అవమానించిన సమయంలో ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. సనాతన ధర్మానికి జరుగుతున్న అవమానంపై ప్రతిపక్షాలు మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాలు కేవలం సనాతన ధర్మాన్ని అవమానించడానికే పరిమితం అవుతున్నారు. ఇది వారి మనస్తత్వం తెలియజేస్తోంది. ఈమధ్య సనాతన ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతున్నాయి. తాను ఉపనిషత్తులు, భగవద్గీత చదివానని చెప్తున్న రాహుల్ గాంధీ.. ఈ వివాదంపై ఎందుకు స్పందించడం లేదు’’ అని చెప్పారు. ఇదే సమయంలో దేశం పేరు మార్పుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘కొందరు వ్యక్తులకు అబద్ధాలు చెప్పి జనాల్లో భయం, గందరగోళం పెంచే అలవాటు ఉంటుంది. వాళ్లు కూడా తమ జీవితమంతా అదే చేస్తూ వచ్చారు’’ అని చురకలంటించారు.
అనంతరం రామమందిర నిర్మాణం పూర్తయ్యాక గోధ్రా తరహా అల్లర్లు జరుగుతాయని ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ ఠాక్రే స్పందిస్తూ.. అధికార దాహంతో ఆయన తన సిద్ధాంతాలను మర్చిపోయినట్టు ఉన్నారని కౌంటర్ వేశారు. ‘‘శివసేన వ్యవస్థాపకులు, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ బ్రతికే ఉంటే ఈరోజు ఆయన ఎలా ఆలోచించేవారో తెలీదు కానీ.. ఉద్ధవ్ మాత్రం అధికార దాహంతో వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. రాహుల్, ఉద్ధవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరం’’ అని చెప్పుకొచ్చారు. వాళ్లు మౌనంగా ఉండటం తగదని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Updated Date - 2023-09-12T22:18:13+05:30 IST