Asadudding Owaisi: మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? విపక్షాలపై ఒవైసీ ఫైర్..!
ABN, First Publish Date - 2023-06-23T18:58:16+05:30
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి ప్రయత్నాల్లో భాగంగా పాట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు, నాయకుల గత చరిత్ర ఏమిటని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారంనాడిక్కడ నిలదీశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections 2024) బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి ప్రయత్నాల్లో భాగంగా పాట్నా (Patna)లో సమావేశమైన విపక్ష పార్టీలు, నాయకుల గత చరిత్ర (Track record) ఏమిటని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) శుక్రవారంనాడిక్కడ నిలదీశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మరోసారి 2024లో ప్రధాని కావాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు.
నితీష్ కుమార్‌పై ప్రశ్నల వర్షం..
విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకున్న నితీష్ కుమార్ ఒక పడవ నుంచి ఒక పడవ పైకి దూకుతుంటారని, బీజేపీ నుంచి మహాకూటమి వైపు, మహాకూటమి నుంచి తిరిగి బీజేపీ వైపు, మళ్లీ మహాకూటమి వైపు వెళ్తుంటారని విమర్శించారు. ''నరేంద్ర మోదీ 2024లో దేశ ప్రధానమంత్రి కావాలని మేము కోరుకోవడం లేదు. అయితే, అందుకోసం మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమటనేవి ముఖ్యం. ఇవాళ జరిగిన పాట్నా సమావేశం తీసుకుంటే, అక్కడ సమావేశమైన నాయకుల ట్రాక్ రికార్డు ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కారణం కాదా? గోద్రా ఘటన జరిగినప్పుడు నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా లేరా? గుజరాత్ మారణహోం జరిగినప్పుడు బీజేపీలో కొనసాగలేదా? బీజేపీతో పొత్తు కారణంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత బీజేపీని విడిచిపెట్టి మహాకూటమి ఏర్పాటు చేసి తిరిగి సీఎం అయ్యారు. మళ్లీ వాళ్లను వదిలిపెట్టి బీజేపీ వైపు వెళ్లారు. ఇప్పుడు తిరిగి బీజేపీని విడిచిపెట్టారు'' అని ఒవైసీ అన్నారు.
ఉద్ధవ్, కేజ్రీవాల్‌కు ప్రశ్నలు..
శివసేన (ఉద్ధవ్ వర్గం) సెక్యులర్ పార్టీగా మారిందా అని ఒవైసీ ప్రస్నించారు. ఉద్ధవ్ థాకరే సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ, బాబ్రీ మసీదు కూల్చివేసినందుకు తాము గర్వపడుతున్నామని చెప్పారని, రాజ్యాంగవిరుద్ధంగా 370వ అధికరణను బీజేపీ తొలగించినప్పుడు అందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతిచ్చారని గుర్తుచేశారు. విపక్షాల ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశంపై ఒవైసీని అడిగినప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం 540 స్థానాల్లోనూ పోటీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విపక్ష పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
Updated Date - 2023-06-23T19:01:20+05:30 IST