Ashok Gehlot: బీజేపీలో క్రమశిక్షణ లేదు...సీఎంల ప్రకటనలో జాప్యంపై గెహ్లాట్ మండిపాటు
ABN, First Publish Date - 2023-12-09T16:16:21+05:30
హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ ఎడతెగని జాప్యం చేస్తుండటాన్ని రాజస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుపట్టారు. బీజేపీలో క్రమశిక్షణ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ: హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ (BJP) ఎడతెగని జాప్యం చేస్తుండటాన్ని రాజస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తప్పుపట్టారు. బీజేపీలో క్రమశిక్షణ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరును మదింపు చేసేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి గెహ్లాట్ హాజరు కావడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
''ఆ పార్టీలో (బీజేపీ) క్రమశిక్షణ లేదు. అదే పని మేము చేసి ఉంటే మాపై ఎన్ని అభియోగాలు చేసేవారో చెప్పలేను. ఎన్నికలను బీజేపీ పోలరైజ్ చేసింది. కొత్త ప్రభుత్వానికి మేము సహకరిస్తాం'' అని గెహ్లాట్ మీడియాతో చెప్పారు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది దారుణహత్య కేసుపై మాట్లాడూతూ, ఎన్ఐఏ దర్యాప్తునకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను డాక్యుమెంటుపై సంతకం చేశానని, కొత్త సీఎం కూడా ఈపని చేయవచ్చని చెప్పారు. ఇప్పటికి ఏడు రోజులైనా ముఖ్యమంత్రి ఎంపిక చేయడంలో బీజేపీ జాప్యం చేస్తోందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను కోరుతున్నానని అన్నారు.
మతపరమైన అంశాలు, అబద్ధాల ప్రచారాలు..
రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ మతపరమైన అంశాలతో ప్రజలను పోలరైజ్ చేసిందని గెహ్లాట్ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, 370వ అధికరణ రద్దు, కన్హ్యయ లాల్ హత్య అంశాలను లేవనెత్తడంతో పాటు, ముస్లింలకు రూ.50 లక్షలు ఇస్తుండగా, హిందువులకు రూ.5 లక్షలు మాత్రమే ఇస్తున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేశారని, అబద్ధాల వ్యాప్తితోనే ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. అయినప్పటికీ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి తాము సహకరిస్తామని తెలిపారు.
Updated Date - 2023-12-09T16:16:23+05:30 IST